మిగిలింది కన్నీరే!
- హంద్రీ-నీవాకు పుష్కలంగా నీళ్లు
- జిల్లాకు రికార్డు స్థాయిలో 26 టీఎంసీల సరఫరా
- హంద్రీ-నీవా, హెచ్చెల్సీ ద్వారా మొత్తం 37.5 టీఎంసీల చేరిక
-అయినా రైతులకు తప్పని కన్నీరు
అనంతపురం సెంట్రల్ : ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది జిల్లా రైతుల పరిస్థితి. ఈ ఏడాది జిల్లాకు పుష్కలంగా నీళ్లొచ్చినా పంట పొలాలను మాత్రం బీడుపెట్టక తప్పలేదు. హంద్రీ-నీవా, హెచ్చెల్సీ ద్వారా వచ్చిన మొత్తం 37.5 టీఎంసీల నీటిని పాలకులు, అధికారులు కలిసి వృథా చేశారు. రైతుల నోట్లో మట్టికొట్టారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పడిపోవడంతో హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకానికి శనివారం నుంచి నీటి సరఫరా ఆపేశారు. అయితే.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 37.5 టీఎంసీల నీటిని ఈ పథకం ద్వారా తీసుకున్నారు. ఇందులో జిల్లాకు దాదాపు 26.5 టీఎంసీలు వచ్చాయి. ఈ పథకం ప్రారంభం నుంచి అత్యధికంగా ఈ ఏడాదే రావడం గమనార్హం.
దీంతో పాటు తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ద్వారా దాదాపు 11 టీఎంసీల నీళ్లొచ్చాయి. మొత్తమ్మీద జిల్లాకు 37.5 టీఎంసీల నీరు చేరినా.. ఆయకట్టు భూములు మాత్రం బీడుగానే దర్శనమిస్తున్నాయి. గతంలో 20 టీఎంసీలు వచ్చిన సందర్భాల్లోనూ జిల్లాలో గణనీయంగా పంటలు పండించారు. అలాంటిది 37.5 టీఎంసీలు వచ్చినా పంటలకు ఇవ్వకపోవడంపై విమర్శలొస్తున్నాయి. ఇందుకు పాలకులు, అధికారుల వైఫల్యమే కారణమని రైతులు అంటున్నారు. ఎప్పుడూ పైరు పంటలతో కళకళలాడే కణేకల్లు, బొమ్మనహాళ్ ప్రాంతాల భూములు కూడా ఈ ఏడాది బీడుపడ్డాయి. హెచ్‌ఎల్‌ఎంసీ, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్(జీబీసీ) కింద 31 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేసినా.. ప్రణాళిక లోపించడంతో చేతికొచ్చే సమయంలో నీటితడులు అందక పంటలు దెబ్బతిన్నాయి.
లోపించిన ప్రణాళిక
ఈ ఏడాది ఆరంభం నుంచే నీటి పంపిణీపై ప్రణాళిక లోపించిందని చెప్పవచ్చు. కనీసం సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం కూడా పూర్తిస్థాయిలో నిర్వహించలేదు. తొలుత సమావేశం ఏర్పాటు చేసినా అప్పటికి తుంగభద్ర ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయిలో నీళ్లు రాలేదు. దీంతో తూతూమంత్రంగా ముగించేశారు. హంద్రీ-నీవా ద్వారా నీళ్లొచ్చిన తర్వాత కూడా వాటిని ఎలా ఉపయోగించుకుందామనే ఆలోచన చేయలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరికి వారు పట్టుదలతో తమ ప్రాంతాలకు నీటిని తరలించుకుపోయారు.
ఆ నీటిని కూడా పొలాలకు ఇవ్వలేదు. చెరువులకు పరిమితం చేశారు. అధికారులు సైతం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పినట్లు నడుచుకున్నారు. ఫలితంగా జిల్లాలో అన్ని ప్రాంతాలకు సమానంగా నీటి పంపిణీ జరగలేదు. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల నాయకులు ధర్నాలు, ఆందోళనలు చేశారు. తీవ్ర వర్షాభావం వల్ల మెట్ట రైతులు తీవ్రంగా నష్టపోగా.. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల స్వార్థం, అధికారుల తీరు కారణంగా ఆయకట్టు రైతులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది.