హైకోర్టును ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ లాయర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది.
తాడితోట (రాజమండ్రి): హైకోర్టును ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ లాయర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. అలాగే, రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలని కోరింది. రాజమండ్రి బార్ అసోసియేషన్ హాలులో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు, ఏపీ లాయర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కో కన్వీనర్ ముప్పాళ్ళ సుబ్బారావు తదితరులు మాట్లాడారు.
ఏపీ హైకోర్టును హైదరాబాద్‌లోనే కొనసాగించాలనే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలో పేర్కొన్న నిధులు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో పునర్విభజన చట్టంలోని సెక్షన్-8ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 10, 11 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరిస్తారని తెలిపారు.