చేతులు కాలాక.. | hlc quoata complete | Sakshi
Sakshi News home page

చేతులు కాలాక..

Published Wed, Nov 2 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

hlc quoata complete

- హెచ్చెల్సీ కోటా అయిపోయాక అధికార పార్టీ ప్రజాప్రతినిధుల హడావుడి
- డెడ్‌ స్టోరేజీ సమయంలో అదనపు నీటి కోసం కసరత్తు
- టీబీబోర్డుకు లేఖ రాసిన చీఫ్‌ విప్‌ కాలవ
- ముందే మేల్కొని ఉంటే ప్రయోజనం ఉండేదంటున్న నిపుణులు


అనంతపురం సెంట్రల్‌ : కరువు పారదోలతానంటూ ఆగస్టు చివర్లో జిల్లాకు వచ్చి హడావుడి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అదే సమయంలో కేసీ కెనాల్‌ డైవర్షన్‌ కోటా నీటిని కర్నూలుకు మళ్లిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల జిల్లాకు తీరని అన్యాయం జరిగింది. దీనిపై నోరెత్తని టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి వచ్చిన  సమయంలో అదనపు కోటా కోసం లేఖలు రాయడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది తుంగభద్ర జలాశయం నుంచి ఆశించిన స్థాయిలో నీరు రాలేదు.  22.6 టీఎంసీలు వస్తాయని మొదట్లో అంచనా వేశారు.

చివరకు 10 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. దీంతో ఽనీటి పంపిణీ లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఆయకట్టు కింద పంటలను నిషేధించారు. ముందస్తుగా సాగు చేసుకున్న అరకొర పంటలను కాపాడటమే అధికారులకు గగనంగా మారింది. ఈ సమయంలో కేసీ కెనాల్‌ డైవర్షన్‌ కోటా నీరు కొంత వరకు ఆదుకుంటుందిలే అని అధికారులు భావించారు. అయితే.. సీఎం నిబంధనలకు విరుద్ధంగా ఈ నీటిని కర్నూలు జిల్లాకు మళ్లిస్తూ జీవో విడుదల చేశారు.  ఈ విషయంపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేసినా.. అధికారపార్టీ నేతలకు చీమకుట్టినట్లు కూడా లేదు.

డెడ్‌స్టోరేజీకి నీటిమట్టం
     తుంగభద్ర జలాశయంలో ప్రస్తుతం 24 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మరో నాలుగు టీఎంసీలు తగ్గిపోతే హెచ్చెల్సీకి నీళ్లు ఎక్కవు. ఇవి తగ్గిపోవడానికి కూడా రెండు,మూడు రోజులకు మించి పట్టదు. ఆ తర్వాత ఎల్‌ఎల్‌సీ, బళ్ళారి జిల్లా రైతులు మాత్రమే వాడుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్చెల్సీకి అదనంగా నీళ్లు విడుదల చేయాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు లేఖలు రాయడం మొదలుపెట్టారు.  నీళ్లు ఉన్నప్పుడే ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతి అమలు చేసి ఎక్కువ నీళ్లు రాకుండా చేశారు. న్యాయబద్ధంగా రావాల్సిన కేసీ కెనాల్‌ డైవర్షన్‌ కోటాను మళ్లించారు. ఇప్పుడు అంతా అయిపోయాక నీళ్ల రాజకీయం  మొదలు పెట్టారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
 
ముగిసిన హెచ్చెల్సీ కోటా : శేషగిరిరావు, ఎస్‌ఈ, హెచ్చెల్సీ
హెచ్చెల్సీకి దామాషా ప్రకారం నికర జలాల కోటా బుధవారంతో పూర్తయ్యింది. ఇప్పటి వరకూ 10.1 టీఎంసీలు జిల్లాకు వచ్చాయి. అదనంగా నీటిని విడుదల చేయాలని బోర్డు అధికారులకు లేఖ రాశాం. కేసీ కెనాల్‌ వాటా దామాషా ప్రకారం 3 టీఎంసీలు ఇవ్వాలి. అయితే..ఇప్పటికే కర్నూలుకు దాదాపు 2.6 టీఎంసీలు విడుదల చేశారు. మిగిలిన నీటిని జిల్లాకు ఇవ్వాలని పట్టుబడుతున్నాం. ఈ నీళ్లొస్తే ఈ నెల 17వరకూ హెచ్చెల్సీకి విడుదలవుతాయి. లేదంటే బుధవారంతోనే నీటివిడుదల ముగిసిపోయినట్లే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement