కలకలం సృష్టిస్తున్న ‘అర్డర్లీ’ పనులు
♦ హోంగార్డులు - ఎస్పీ మధ్య వైరం
♦ డీఐజీ ఎదుట వాంగ్మూలాల నమోదు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : నాలుగో సింహం దారి తప్పింది. వక్రమార్గాల్లో పయనిస్తూ ప్రజల్లో చులకన అవుతోంది. కిందిస్థాయి సిబ్బందికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఉన్నతాధికారులు పక్కదారి పట్టడంతో పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు వస్తోంది. తాజాగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ. ఎస్పీ నవీన్‌కుమార్ తమను ఆర్డర్లీ పనులకు వినియోగించుకుంటున్నారని హోంగార్డుల బహిరంగ ప్రకటన ఒకవైపు.. అడిషనల్ ఎస్పీ వెంకటస్వామితోపాటు మరికొందరు కావాలనే తనను ఇరికించారని ఎస్పీ మరోవైపు రచ్చకెక్కడం జిల్లా పోలీసు విభాగానికి మచ్చ తెచ్చింది. సొంత సేవలకు హోంగార్డులను వాడుకోవడం.. వెట్టి కార్మికుల్లాగా వారిని పరిగణించారనే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ వ్యవహారశైలి వివాదాస్పదమైంది.
అయితే, ఫొటోల వెనుక పెద్ద కుట్ర దాగుందని, దీనికి సూత్రదారి అదనపు ఎస్పీ వెంకటస్వామేనని ఎస్పీ నవీన్‌కుమార్ ఆరోపించడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో గతంలో ఎస్పీ ఆఫీసులో సీసీగా పనిచేసిన మహేశ్ ను అవినీతి అభియోగంతో సస్పెండ్ చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఈ క్రమంలో రంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామాలను సీరియస్‌గా పరిగణించిన పోలీసు శాఖ.. ఈ సంఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్‌ను ఆదేశించింది.
దీంతో గత రెండు రోజులుగా హోంగార్డుల వాంగ్మూలం నమోదుచేస్తున్న సబర్వాల్.. ఈ ఘటన పూర్వపరాలను ఆరా తీస్తున్నారు. ఆర్డర్లీ పనులు చేశారని గుర్తించిన 18 మంది హోంగార్డులను విడివిడిగా విచారించి నివేదిక రూపొందిస్తున్నారు. ఇదే క్రమంలో సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోల వెనుక ఎవరి పాత్ర ఉందనే కోణంలోనూ అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా, జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ కూడా తనపై వచ్చిన ఆరోపణలపై డీఐజీకి సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
మారని తీరు..!
గ్రామీణ ఎస్పీగా ఎవరు బాధ్యతలు స్వీకరించినా వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. గతంలో ఇక్కడ ఎస్పీగా పనిచేసిన శ్రీనివాస్ కూడా ఆరోపణలు మూటగట్టుకొని అనతి కాలంలోనే బదిలీ అయ్యారు. ఇసుక మాఫియా మొదలు యాలాల ఎస్‌ఐ రమేశ్ ఆత్మహత్య వ్యవహారం ఆయనకు మెడకు చుట్టుకున్నాయి. దీనికితోడు ఆయన హయంలో జరిగిన ఎస్‌ఐ బదిలీల్లోనూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో స్వల్పకాలంలోనే తప్పుకోవాల్సివచ్చింది. ఈ పరిణామాల నుంచి కోలుకోకమునుపే ప్రస్తుత ఎస్పీ నవీన్‌కుమార్ కూడా వివాదాల్లో కూరుకుపోవడం జిల్లా పోలీసువర్గాల్లో చర్చనీయాంశమైంది.