వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తులు | huge crowd at vaishno temples due to vaikunta ekadasi | Sakshi
Sakshi News home page

వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తులు

Published Mon, Dec 21 2015 8:48 AM | Last Updated on Sun, Sep 3 2017 2:21 PM

వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తులు

వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తులు

హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలు సోమవారం భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామి వార్లను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు క్యూ కట్టారు. ఆలయాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్: జంట నగరాల్లోని ఆలయాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. వైష్ణవాలయాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కుషాయిగూడ శ్రీ వెంకటేశ్వరస్వామి, వనస్థలిపురం శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

తిరుమల: కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమల భక్తులతో కిక్కిరిసింది. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తకోటి పోటెత్తింది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 62 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాయంత్రం శ్రీవారు స్వర్ణరథంపై ఊరేగనున్నారు.

గుంటూరు జిల్లా: మంగళగిరిలోని శ్రీపానకాల లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తారు. ఉదయం ఏడు గంటల సమయానికే సుమారు 40వేల మంది స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతోంది.

ద్వారక తిరుమల: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమలలో వెంకటేశ్వరస్వామి నిజరూప అవతారంలో దర్శనమిస్తున్నారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయానికి పోటెత్తారు.

వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులోని శ్రీ వాసవీ కన్యాకపరమేశ్వరీ అమ్మవారిని సోమవారం 108 దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని అమ్మవారికి వజ్రపుచీర, వజ్రపు కిరీటం ధరింపజేశారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు మహాలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి, బొల్లవరం ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ నెలకొంది.

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని వైష్ణవాలయాలు భక్తజనసందోహంతో కలకలలాడుతున్నాయి. శ్రీకల్పగిరి రంగనాథస్వామి, మూలాపేటలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయాల్లో స్వామి వార్లను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు.

సింహాచలం: సింహాచలం కొండపై అప్పన్న శ్రీమన్నారాయణుని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు దర్శనం కోసం భారీగా క్యూ కట్టారు.

కరీంనగర్ జిల్లా:  ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాలకు భక్తులు రద్దీ కొనసాగుతుంది.

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పవిత్ర గోదావరిలో స్నానాలు ఆచారించి స్వామి దర్శనానికి బారులు తీరారు. ఉత్తర ద్వారాన్ని అందంగా అలంకరించారు. గరుడవాహనరూడుడైన స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.

యాదాద్రి: నల్లగొండ జిల్లాలోని యాదాద్రి భక్తసంద్రమైంది. క్యూలైన్లు నిండిపోగా, వెలుపల కూడా భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement