భర్తకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్న సుందరమ్మ
కొత్తూరు: విధివశాత్తూ రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయింది. అంతిమ సంస్కారాలు చేసేందుకు అతని బంధువులెవరూ ముందుకు రాకపోవటంతో చివరకు భర్త అంత్యక్రియలు తానే నిర్వహించిన ఇల్లాలి విషాదగాథ. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని కృష్ణాపురంలో ఆదివారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలోని విష్టల గ్రామానికి చెందిన మీసాల అప్పారావు (55) ఐదేళ్ల క్రితం కృష్ణాపురం గ్రామంలో స్థిరపడి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి బైక్ ఢీకొన్న ప్రమాదంలో అప్పారావు ప్రాణాలు కోల్పోయాడు. అప్పారావు, సుందరమ్మ దంపతులకు కుమారుడు, కూతురు సంతానం. అయితే, ఒక్కగానొక్క కుమారుడు కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు.
అల్లుడు కూడా రెండేళ్ల కిందట గుండె పోటుతో చనిపోయాడు. ఈ పరిస్థితిలో అంత్యక్రియలు ఎవరు నిర్వహిస్తారనే విషయంలో సందిగ్ధం నెలకొంది. ఒడిశాలో ఉంటున్న మృతుని ఇద్దరు సోదరులకు అప్పారావు మృతి సమాచారాన్ని స్థానికులు తెలియజేసినప్పటికీ.. వారు ఏవో సాకులు చెప్పి రాకుండా తప్పించుకున్నారు. దీంతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు రక్త సంబంధీకులు ఎవరూ లేని పరిస్థితి తలెత్తింది. ఇలాంటి స్థితిలో మృతుని భార్య సుందరమ్మ భర్త మృతదేహానికి తలకొరివి పెట్టింది.