
మాట్లాడుతున్న డాక్టర్ భగవంత్‌రావు
గన్‌ఫౌండ్రీ: హుస్సేన్‌సాగర్‌ను వినాయకసాగర్‌గా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్‌రావు అన్నారు. వినాయకసాగరంలో గణేష్ నిమజ్జనాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. శనివారం బేగంబజార్‌లోని బెహతి భవన్‌లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ... సెప్టెంబర్ 5న ప్రారంభమయ్యే వినాయక నవరాత్రి ఉత్సవాలు 15న సామూహిక నిమజ్జనంతో ముగుస్తాయన్నారు.
గణేష్ నిమజ్జనం కారణంగా వాతావరణం కలుషితం కావడంలేదని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమర్పించిన నివేదిక స్పష్టం చేసినా, కొందరు వ్యక్తులు నిమజ్జనంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గణేష్ విగ్రహాల ఎత్తుపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని దీనిపై అపోహలు సృష్టించడం సరికాదన్నారు. రామానుజాచార్య శతజయంతి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ‘సామాజిక సామరస్యత’పై ప్రతి మున్సిపల్ డివిజన్‌లో సదస్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు.