సాక్షి,సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో ఆహార భద్రత(రేషన్) కార్డు దారులకు గ్యాస్ కనెక్షన్ తప్పని సరిగా మారింది. పౌరసరఫరాల శాఖ కొత్త కార్డుల మంజూరుకు వంట గ్యాస్ కనెక్షన్ మెలిక పెట్టింది. వంట గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న పేద కుటుంబాలకు మాత్రమే కొత్త కార్డులు మంజూరు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న కార్డులకు సైతం గ్యాస్ కనెక్షన్ తప్పని చేయాలని అధికారులను సూచించారు.
విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్న హెదరాబాద్ మహా నగరాన్ని కాలుష్య రహిత మార్చేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే నగరంలో కిరోసిన్ వినియోగం నివారణ కోసం కసరత్తు చేస్తోంది. గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలకు తక్షణమే వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసే విధంగా ఆయిల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల వారిగా గ్యాస్ వినియోగం లేని కుటుంబాలను గుర్తించి వారికి కనెక్షన్లు ఇప్పించే బాధ్యతలను డీలర్లకు అప్పగించింది.
వంటగ్యాస్ లేని కుటుంబాలపై దృష్టి
గ్రేటర్ హైదరాబాద్‌లో వంట గ్యాస్ కనెక్షన్లు లేని ఆహార భద్రత కార్డుదారులపై పౌరసరఫరా శాఖ దృష్టి సారించింది. మొత్తం 11.71 లక్షల ఆహార భద్రత (రేషన్) కార్డుదారులుండగా అందులో వంట గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలు 2.37 లక్షలపైన ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి నెల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లేని కార్డుదారులకు నాలుగు లీటర్లు, సింగిల్ ఎల్పీజీ సిలిండర్ గల కార్డుదారులకుSఒక లీటర్ల చొప్పున కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రతినెలా సుమారు 18.77లక్షల లీటర్ల వరకు కిరోసిన్ కోటాను కేటాయిస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో తెల్ల కిరోసిన్ లీటరు ధర రూ.49లు ఉండగా, చౌక ధరల దుకాణాల ద్వారా కేవలం లీటరు కిరోసిన్ రూ.15ల చొప్పున కార్డుదారులకు పంపిణీ చేస్తోంది. మిగతా రూ.34లను సబ్సిడీగా కేంద్రం భరించి చమురు సంస్థలకు చెల్లిస్తోంది. అయితే ఇందులో 60 శాతం పైగా కిరోసిన్ పక్కదారి పడి వంటింట్లోకి బదులు వాహనాల్లో ఇంధనం గా మారుతోంది. ఫలితంగా వాహనాలు కాలుష్యం చిమ్ముతూ నగర వాసుల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంటాయి.