పనితీరు మెరుగుపరుచుకోకపోతే బదిలీలే
-
గృహ నిర్మాణ శాఖ అధికారులకు కలెక్టర్ హెచ్చరిక
నెల్లూరు(పొగతోట): పనితీరు మెరుగుపరుచుకోకపోతే జిల్లా నుంచి బదిలీ చేయిస్తామని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు గృహ నిర్మాణ సంస్థ అధికారులను హెచ్చరించారు. స్థానిక గోల్డన్‌జూబ్లీ హాల్లో గృహ నిర్మాణ సంస్థ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించి అసంపూర్తి గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద మంజూరు చేసిన గృహాల లక్ష్యాలను అక్టోబర్‌లోగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ప«థకాల అమలకు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గృహ నిర్మాణ సంస్థ పీడీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 2015–16 ఆర్థిక సంవత్సరంలో 3670 ఇళ్లు మంజూరుకాగా, ఇప్పటి వరకు 2,372 గృహనిర్మాణాలు పూర్తి చేశామన్నారు. నెలఖారుకు 400 గృహాలు నిర్మించాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 203 గృహాలను పూర్తి చేశామన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో గృహనిర్మాణ సంస్థ ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.