ఇబ్బందులే అసలు పరీక్ష
ఇబ్బందులే అసలు పరీక్ష
Published Mon, Feb 27 2017 12:25 AM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM
ఏలూరు సిటీ : గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ప్రశాం తంగా ముగిసింది. అడుగడుగునా సమస్యలు, ఇబ్బం దులు అభ్యర్థులకు పెద్ద పరీక్షగా మారాయి, విధిగా గుర్తింపు కార్డులు తీసుకురావాలనే నిబంధనపై అవగాహన కల్పించకపోవటంతో వందలాది మంది పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. ఆర్ట్స్ గ్రూప్ అభ్యర్థులకు ఈ పరీక్ష ఏపీపీఎస్సీ స్థాయిలో లేదని చెబుతుండగా, సైన్సు సబ్జెక్ట్ అభ్యర్థులకు మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది. జిల్లా వ్యాప్తంగా 65 పరీక్షా కేంద్రాల్లో 74.39 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఎన్ని ఇబ్బందులో..
జిల్లాలో 39,828మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 10,201 మంది గైర్హాజరయ్యారు. 29,627 మంది స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరయ్యారు. 9 మంది స్పెషల్ ఆఫీసర్లు, 30మంది లైజాన్ ఆఫీసర్లు, కలెక్టర్ కె.భాస్కర్, జేసీ పులిపాటి కోటేశ్వరరావు, డీఆర్‌వో కట్టా హైమావతి, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ వీ.రమేష్‌బాబు, డీఈఓ ఆర్‌ఎస్ గంగాభవాని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. కలెక్టర్ భాస్కర్ ఏలూరులోని సీఆర్‌ఆర్ అటానమస్, సీఆర్‌ఆర్ ఉమెన్స్, సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీల్లోని కేంద్రాలను తనిఖీ చేశారు. ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, తణుకు, తాడేపల్లిగూడెం, పెదపాడు, పెదవేగి, నల్లజర్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఏలూరు రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీ పరీక్షా కేంద్రం వద్ద తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంకు చెందిన ఎస్.దివ్య గుర్తింపు కార్డు లేకుండా రావటంతో పరీక్ష రాసేందుకు అధికారులు నిరాకరించారు. గోడు చెప్పుకునే అవకాశాన్ని కూడా అధికారులు ఇవ్వకపోవటం గమనార్హం. చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తడంతో వందలాది మంది అభ్యర్థులు పరీక్ష రాయకుండా వెనుదిరగాల్సి వచ్చింది. ఆర్టీసీ బస్సులు కిటకిటలాడాయి. టికెట్లు ఇచ్చేందుకు బస్సులను పలుచోట్ల నిలుపుదల చేయడంతో అభ్యర్థులు ఒత్తిడికి గురయ్యారు. సకాలంలో పరీక్ష కేంద్రానికి వెళ్లగలమో లేదోనని ఆందోళన చెందారు. నెలల తరబడి శిక్షణ పొందిన వారితోపాటు పరీక్షలో ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే ఆశతో అభ్యర్థులు తీవ్రంగా శ్రమించారు. చాలామంది ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. 9.30 గంటల నుంచి వారికి లోనికి అనుమతించారు. చంటి పిల్లలు ఉన్న వారు భర్త, బంధుగణంతో పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు చెట్లు, పుట్టలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదిలావుంటే.. వేసవి వచ్చేసిందా అన్నట్టు భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు.
Advertisement
Advertisement