మహ్మద్ ఉస్మాన్, జీషాన్ అలీఖాన్, అబ్దుల్ ఖాలేద్
సాక్షి, సిటీబ్యూరో: బోగస్ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి శనివారం వెల్లడిం చారు. రాజేంద్రనగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాలేద్ ఉప్పర్‌పల్లిలో నూర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ రకంగా వచ్చే ఆదాయంతో సంతృప్తి చెందని ఇతగాడు ఎస్సెస్సీ నుంచి పీజీ వరకు వివిధ రకాలైన నకిలీ సర్టిఫికెట్లు విక్రయించడం ద్వారా తేలిగ్గా డబ్బు సంపాదించాలని పథకం వేవాడు.
ఢిల్లీకి చెందిన విశాల్ అనే వ్యక్తి ద్వారా మహాత్మాగాంధీ కృషి విద్యాపీ(ఉత్తరప్రదేశ్), వీర్‌భద్రసింగ్ పూర్వాంచల్ యూనివర్శిటీ, భర్కతుల్లా యూనివర్శిటీ (మధ్యప్రదేశ్), బుంధేల్‌ఖండ్ యూనివర్శిటీ (ఉత్తరప్రదేశ్), మానవ్‌భారతి యూనివర్శిటీ (హిమాచల్‌ప్రదేశ్) పేర్లతో సర్టిఫికెట్లు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు ఖరీదు చేసేవాడు. అక్కడ నుంచి ఈ ధ్రువీకరణపత్రాలను విశాల్ కొరియర్‌లో ఖాలేద్‌కు పంపేవాడు. వీటిని సైఫాబాద్ ప్రాంతంలో లిమ్రా అటెస్టేన్స్ సంస్థను నిర్వహిస్తున్న మహ్మద్ ఉస్మాన్‌కు అప్పగించేవాడు. ఇతడు ఈ సర్టిఫికెట్లపై వివిధ రకాలైన స్టాంపులు వేసేవాడు.
ఇలా పక్కాగా తయారు చేసిన సర్టిఫికెట్లను అవసరమైన వారికి రూ.40 వేల వరకు విక్రయించేవాడు. మెహిదీపట్నానికి చెందిన నిరుద్యోగి జీషాన్ అలీఖాన్ ఉద్యోగం పొందడానికి రూ.20 వేలతో నకిలీ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఖరీదు చేశాడు. ఈ సర్టిఫికెట్ల ముఠాతో ఢిల్లీ, హిమాయత్‌నగర్‌లకు చెందిన షోయబ్, సబిత్‌లకు ప్రమేయం ఉంది. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ నేతృత్వంలోని బృందం వలపన్ని శనివారం విశాల్, షోయబ్, సబిత్ మినహా మిగిలిన ముగ్గురినీ అరెస్టు చేసింది. వీరి నుంచి 24 బోగస్ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకుని కేసును బహదూర్‌పుర పోలీసులకు అప్పగించింది.
మరోపక్క నల్లకుంట పోలీసుస్టేషన్ పరిధిలో మూడు ముక్కలాట నడుస్తున్న ప్రాంతంపై టాస్క్‌ఫోర్స్ దాడి చేసింది. నిర్వాహకుడు డి.లక్ష్మణ్‌తో పాటు 10 మందిని అరెస్టు చేసి రూ.1.51 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. నెల రోజులుగా వ్యవస్థీకృతంగా దందా నిర్వహిస్తున్న లక్ష్మణ్.. ఒక్కో గేమ్‌కు ఆడేవారి నుంచి రూ.2 వేల చొప్పున వసూలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.