470కి 406 మార్కులే వచ్చాయని..
కడప: ఇవ్వాళ ఇంటర్ పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఫస్ట్ ఇయర్ పూర్తిచేసిన పూజిత మంచి మార్కులతో పాసైంది. 470కిగానూ ఆమెకు 406 మార్కులు వచ్చాయి. మామూలు పిల్లలైతే ఎగిరి గంతేసి ఎంజాయ్ చేసేవారు. కానీ పూజిత అలా చెయ్యలేదు. సెంట్ పర్సెంట్ కు 64 మార్కులు తక్కువొచ్చాయే అని బాధపడింది. ఎందుకంటే ఆమె టీచర్ల బిడ్డమరి! అవును. పూజిత తల్లిదండ్రులిద్దరూ టీచర్లు. ఇంకా చెప్పాలంటే సొంతంగా చేతగాక పిల్లల ర్యాంకులతో 'హోదా' కోరుకునే సోకాల్డ్ 'చైల్డ్ లవింగ్' పేరెంట్స్. పిల్లలు బాగా చదవాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ మార్కుల రేసులో పిల్లల్ని పరుగెత్తించడం తప్పు. ఇప్పుడు పూజిత ఈ లోకంలో లేదు. తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు దండించడంతో పురుగుల మందుతాగి ప్రాణాలు వదిలింది.
వైఎస్సార్ కడప జిల్లాలోని సంబేపల్లిలో అమరనాథ్ రెడ్డి దంపతులు టీచర్లుగా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి మంచి మార్కులు సాధిస్తూ చదువుల్లో ముందుకు వెళుతోంది. చిన్నమ్మాయి పూజిత కూడా తెలివైన విద్యార్థినే. ఇంటర్ మొదటిసంవత్సరం పరీక్షలు రాసింది. మంగళవారం వాటి ఫలితాలు విడుదల అయ్యాయి. పూజితకు 470 మార్కులకు 406 మార్కులు వచ్చాయి. ఆమెకు వచ్చిన మార్కులతో తల్లిదండ్రులు సంతృప్తి పడలేదు. పెద్ద కూతురి మార్కులతో పోల్చుతూ పూజితను అవమానించారు. మనస్తాపం చెందిన ఆ చదువుల తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు ప్రాణాపాయంలో ఉన్న పూజితను సంబేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స చేస్తుండగానే ఆ విద్యార్థిని ప్రాణాలు వదిలింది. ఈ సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. టీచర్ కుటుంబంలోనే ఇలాంటి సంఘటన జరగటం చర్చనీయాంశం అయింది.