శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రమోగ కేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 28న ప్రయోగించ తలపెట్టిన ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ) ఉపగ్రహం బెంగళూరు నుంచి సోమవారం శ్రీహరికోటకు చేరింది.
సూళ్లూరుపేట: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రమోగ కేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 28న ప్రయోగించ తలపెట్టిన ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ) ఉపగ్రహం బెంగళూరు నుంచి సోమవారం శ్రీహరికోటకు చేరింది. పీఎస్‌ఎల్‌వీ సీ33 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిం చనున్నారు. 1425 కిలోల బరువు ఉన్న ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రం(ఐసాక్) నుంచి ఆదివారం తరలించి చెన్నై మీదుగా భారీ బందోబస్తు మధ్య సోమవారం శ్రీహరికోటకు తీసుకొచ్చారు.
ఉపగ్రహానికి అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత ద్రవ ఇంధనాన్ని నింపి రాకెట్ శిఖర భాగాన అమర్చే ప్రక్రియను చేపడతారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై పీఎస్‌ఎల్‌వీ సీ33 నాలుగు దశల రాకెట్ అనుసంధానం పనులను పూర్తిచేసి ఉపగ్రహాన్ని అమర్చనున్నారు. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థలో ఇది ఆఖరు ఉపగ్రహం. ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని పూర్తిచేస్తే భారతదేశానికి సొంత నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రయోగాన్ని వీక్షించి, నావిగేషన్ సిస్టంను జాతికి అంకితం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షార్‌కు విచ్చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.