అక్రమార్కులపై చర్యలు సాధ్యమేనా ?
అక్రమార్కులపై చర్యలు సాధ్యమేనా ?
Published Tue, Oct 4 2016 6:51 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
* ప్రభుత్వం నుంచి ఏఎన్‌యూ దాకా అదే విధానం
* ఒక్క అంశంపై మూడుసార్లు కమిటీ నియామకం
* ఆనవాయితీగా మారిన కమిటీల విచారణ
* దశాబ్ధం నుంచి నివేదికలూ పెండింగే
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వెలుగులోకి వస్తున్న పలు అవినీతి ఘటనలు, కుంభకోణాలు, అక్రమాలపై నియమిస్తున్న కమిటీలు కేవలం విచారణకే పరిమితమవుతున్నాయేగానీ బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఏదైనా ఘటన జరిగినపుడు దానిపై కమిటీ వేయటం, దర్యాప్తు పేరుతో కాలయాపన చేసి కనుమరుగు చేయటం ఆనవాయితీగా మారుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.
ఏఎన్‌యూ: ఈ ఏడాది జూన్ ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. అన్ని అంశాలు పరిశీలించి 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. నెల రోజుల తరువాత కమిటీ ఏఎన్‌యూలో పర్యటించి నాలుగు రోజులు విచారణ చేపట్టింది. ఆ తరువాత కొద్ది రోజులకు కమిటీలో ఒక సభ్యుని పేరులేకుండా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నుంచి మరో సర్కుల జారీ చేసి ఆ సభ్యులతో అదే అంశంపై విచారణ జరిపించి హడావుడి చేసింది. అదే అంశంపై గత నెల 30వ తేదీన ముగ్గురు సభ్యులతో మరో కమిటీని నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ జీఓ జారీ చేసింది. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది.
పదేళ్ళలో పలు కమిటీలతో హడావుడి...
గత పదేళ్ళలో ఏఎన్‌యూలో పలు కుంభకోణాల విచారణలు పెండింగ్‌లో ఉన్నాయి. 2008 వసంవత్సరంలో పరీక్షా భవన్‌లో డిగ్రీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అవార్డుల్లోమార్కుల తారుమారు కుంభకోణం , ఆతరువాత బీటెక్ జవాబు పత్రాల తారుమారు, మార్కుల తారుమారు కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి.తరువాత పోర్జరీ ఓడీల జారీ, నకిలీ చలానాలతో పాటు అనేక అవినీతి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై శాఖా పరమైన దర్యాప్తు కమిటీలను నియమించటంతోపాటు డిగ్రీ అడ్వాన్స్›్డ సప్లిమెంటరీ మార్కుల తారుమారు కేసు సీబీసీఐడీకి , బీటెక్ మార్కుల వ్యవహారం పెదకాకాని పోలీసులకు అప్పగించింది. వీటిలో శాఖా పరమైన దర్యాప్తు ఆధారంగా కొందరు సిబ్బందిపై చర్యలు తీసుకున్నప్పటికీ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు శూన్యం. దూరవిద్యలో వెలుగులోకి వచ్చిన పరీక్షల కుంభకోణాలు, హైదరాబాద్ పరీక్షా కేంద్రంలో మాల్‌ప్రాక్టీస్ ఘటనలు, ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య, ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షల విధుల్లో ఉద్యోగి అవినీతి వ్యవహారాలు, ఉద్యోగినులపై వేధింపులు వంటి అనేక ఘటనలపై నియమించిన కమిటీల నివేదికల ఆధారంగా చర్యలు లేవు.
త్రిసభ్య కమిటీ విచారణ..
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నియమించిన త్రిసభ్య కమిటీ మంగళవారం నుంచి ఏఎన్‌యూలో పర్యటిస్తుందని వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ తెలిపారు. కమిటీ సభ్యులైన విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ చక్రపాణి, శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విజయలక్ష్మి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తి ఉదయం 10:30 గంటల నుంచి ఏఎన్‌యూలో అందుబాటులో ఉంటారన్నారు.
Advertisement