ఏఎన్‌యూ అక్రమాలపై లోకాయుక్తకు ఫిర్యాదు
Published Wed, Sep 7 2016 10:42 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
* నిధుల వినియోగం, పనుల కేటాయింపులపై ఆరోపణలు
* ఫిర్యాదు దాఖలు చేసిన గుంటూరు వాసి
* నవంబర్ 22న హాజరు కావాలని ఏఎన్‌యూ రిజిస్ట్రార్‌కు లోకాయుక్త సూచన
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గతంలో జరిగిన పలు ఆర్థికపరమైన లావాదేవీలు, ఉద్యోగులకు చెల్లింపులు, వివిధ పరికరాల కొనుగోలు, నిర్మాణ పనులకు అధికంగా చెల్లింపులు చేశారనే అంశాలపై గుంటూరుకు చెందిన కేవీఆర్ శివరాంప్రసాద్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీకి ప్రహరీ నిర్మాణానికి ఓ కాంట్రాక్టర్ రూ.76 లక్షలకు పనులు చేసేందుకు సిద్ధంగా ఉంటే వర్సిటీ అధికారులు మరో కాంట్రాక్టర్‌కు అదే పనిని కోటి రూపాయలకు పైగా ఇచ్చి చేయించారని, దూరవిద్యా కేంద్రంలో కొన్ని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, రోజువారీ వేతన ఉద్యోగుల నియామకం ఉన్నతాధికారుల అనుమతులతో జరగలేదని, కాంట్రాక్ట్ తదితర ఉద్యోగులను మూడు నెలల కాల వ్యవధితో నియమించుకుని వారికి నాలుగు కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉద్యోగుల సర్వీస్ రిజిస్ట్రర్‌ను సక్రమంగా నిర్వహించటం లేదని, పీఆర్‌సీ బకాయిల చెల్లింపులో కోట్ల రూపాయలు గోల్‌మాల్ జరిగాయని ఫిర్యాదులో ఆరోపించారు. పర్చేజింగ్ కమిటీ నిబంధనలు, అనుమతులు పొందకుండానే కొన్ని కొనుగోళ్లు చేశారని, టెండర్లు లేకుండానే ఆస్ట్రేలియా నుంచి రూ.25.46 లక్షల విలువ చేసే పరికరం కొనుగోలు చేశారని, 2012–13లో కమ్యూనిటీ రేడియో స్టేషన్‌కు సంబంధించి రూ.18.45 లక్షల పనులకు టెండర్లు పిలవలేదని పేర్కొన్నారు. యూనివర్సిటీకి చెందిన కొందరు అధ్యాపకులు రూ.4.16 కోట్ల యూజీసీ నిధులను అడ్వాన్స్‌ల రూపంలో తీసుకుని వాటికి లెక్కలు చేపలేదని, కార్ అలవెన్స్‌ల రూపంలో రూ.1.48 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త ఈ ఏడాది నవంబర్ 22వ తేదీ∙హైదరాబాద్‌లోని లోకాయుక్త కార్యాలయంలో హాజరుకావాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు లేఖ పంపింది.
Advertisement
Advertisement