ఆయన పార్టీ మారడం సిగ్గుచేటు
వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా
కాకినాడ : తమ పార్టీ టిక్కెట్‌పై నెగ్గిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఏ మాత్రం సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీలోకి చేరారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి తోట సుబ్బారావు నాయుడును జక్కంపూడి రాజా మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జ్యోతులు నెహ్రూ 2004లో టీడీపీ తరఫున, 2009 ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఇచ్చి గెలిపించడమే కాక శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బాధ్యతలు అప్పగించారని చెప్పారు. అలాగే పార్టీ జిల్లా అధ్యక్షునిగా కూడా బాధ్యతలు అప్పగిస్తే డబ్బు, అధికారానికి ఆశపడి జోత్యుల పార్టీ మారారని విమర్శించారు.
జ్యోతులకు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రూపు, వర్గ రాజకీయాలతో ఆయన పార్టీని కలుషితం చేశారని.. ఈ సందర్భంగా జోత్యులపై జక్కంపూడి రాజా నిప్పులు చెరిగారు. 2014 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి జ్యోతుల నెహ్రూనే కారణం అని రాజా పేర్కొన్నారు.
ఆయన నిష్ర్కమణ తమ పార్టీకి శుభపరిణామమన్నారు. ఎందరు నాయకులు వెళ్లినా ప్రజలు మాత్రం వైఎస్ జగన్ వెంటే ఉన్నారని రాజా స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్నవారిని ఎంత ఎత్తుకైనా తీసుకెళ్తారనడానికి తన తండ్రి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావే ఓ నిదర్శమన్నారు.
నాన్న గారి ఆరోగ్యం అనుకూలించక పోయినా చివరి వరకూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తన మంత్రివర్గంలో ప్రధానమైన రోడ్లు, భవనాలు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా తన తండ్రిని కొనసాగించారని గుర్తు చేసుకున్నారు. జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించేందుకు యువజన విభాగం సారథిగా ప్రత్యేక పాత్ర పోషిస్తానన్నారు. పార్టీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి సుంకర చిన్ని, పలువురు పార్టీ నాయకులు జక్కంపూడి రాజా వెంట ఉన్నారు.