కిర్లంపూడి: బీసీ రిజర్వేషన్ సాధన కోసం అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును గద్దె దించేందుకు కాపు జాతి వెనుకాడబోదని మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలో అక్రమంగా ఎవరిని అరెస్టు చేసినా, వారికి మద్దతుగా యావత్ కాపు జాతి స్వచ్ఛందంగా అరెస్టు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ఆదివారం ఆయన పలు జిల్లాల కాపు ముఖ్య నాయకులతో పాటు, ఐక్యగర్జనలో కేసులు నమోదైన వారితో సమావేశమయ్యారు.
కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ.. ఐక్యగర్జన సందర్భంగా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని కొంత మంది కాపులపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు. కాపులను విభజించి పాలించడంతో పాటు కాపు జాతి నాయకులతో చంద్రబాబు ఎదురు దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జాతిలోని నిరుపేదల కోసం బీసీ రిజర్వేషన్ సాధించే వరకు తన పోరాటం ఆగదన్నారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలవల్లే ఇపుడు రోడ్డెక్కి ఉద్యమం చేయాల్సి వస్తోందన్నారు. హామీలు అమలు చేయక పోవడంతో ఉద్యమం తర్వాత దీక్ష చేపట్టానని చెప్పారు.
గడువులోగా కమిషన్ రిపోర్టు తెప్పించుకుని బీసీ రిజర్వేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తీర్మానాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చే నిమిత్తం కేంద్రానికి పంపించడానికి చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలన్నారు. లేదంటే ఆయన్ను కుర్చీ నుంచి దించుతామని స్పష్టం చేశారు. సమావేశంలో వివిధ జిల్లాల కాపు నాయకులు పాల్గొన్నారు.
'మాటతప్పితే గద్దె దింపుతాం'
Published Sun, May 15 2016 9:30 PM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
Advertisement