తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కృషి అభినందనీయమని రాజ్యసభ మాజీ ఎంపీ, సినీనటుడు డాక్టర్ ఎం.మోహన్‌బాబు అన్నారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
-
మాజీ ఎంపీ, సినీనటుడు మోహన్‌బాబు
వేములవాడ : తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కృషి అభినందనీయమని రాజ్యసభ మాజీ ఎంపీ, సినీనటుడు డాక్టర్ ఎం.మోహన్‌బాబు అన్నారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి నాటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు కృషి చేశారన్నారు. ఆ తర్వాత ఆలయాల అభివృద్ధికి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని ప్రశంసించారు. పదమూడేళ్ల తర్వాత మరోసారి రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకునే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. గతంలో స్వామివారిని దర్శించుకుని వెళ్లిన తర్వాత తమ కుటుంబం క్షేమంగా ఉందని తెలిపారు. దేశ, రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో తులతూగాలని రాజన్నను మొక్కుకున్నట్లు చెప్పారు. తన మిత్రుడు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన సమయంలో తాను ఈ జిల్లాకు ప్రచారం చేసేందుకు వచ్చానని ఆయన గుర్తు చేశారు. సాగర్‌జీతో ఉన్న స్నేహబంధం తనను మరోసారి ఇక్కడికి వచ్చేలా చేసిందన్నారు. ఆయన వెంట కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ఉన్నారు. అంతకుముందు ఆలయ ఈవో దూస రాజేశ్వర్, అర్చకులు మోహన్‌బాబుకు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం బహూకరించారు.