బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం | kidnapped boy uday murdered in vizag | Sakshi
Sakshi News home page

బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం

Published Sun, May 1 2016 9:51 AM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM

బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం - Sakshi

బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం

విశాఖపట్టణం: విశాఖ జిల్లా అనకాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి అపహరణకు గురైన ఉదయ్‌ను కిడ్నాపర్లు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆదివారం ఉదయం కొప్పాడ బ్రిడ్జి కింద బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గరవపాలెంకు చెందిన ఉదయ్(8)గా పోలీసులు గుర్తించారు.

శుక్రవారం రాత్రి దుండగులు ఉదయ్ తండ్రి శ్రీనివాస్‌కు ఫోన్ చేసి రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాలుడి ఇంటి సమీపంలో ఉండే నలుగురు నిందితులు ఉదయ్‌ను కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆకతాయిలు హేమంత్, మనోజ్, రాజుతో పాటు మరో వ్యక్తి బాలుడిని కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. అందులో భాగంగా శనివారం రాత్రి ఫోన్‌ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు హేమంత్, మనోజ్‌ లను అదుపులోకి తీసుకున్నారు. వారి దర్యాప్తులో ఉదయ్ క్షేమంగానే ఉన్నట్టు తెలిపినట్లు సమాచారం.

మిగతా ఇద్దరు నిందితులు బాలుడిని తీసుకువస్తున్నట్టు చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైనట్టేనని పోలీసులు భావిస్తున్న తరుణంలో... అనూహ్యంగా కొప్పాక రైల్వే బ్రిడ్జి కింద బాలుడు శవమై కనిపించాడు. దీంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రాజుతో పాటు మరో నిందితుడు శనివారం రాత్రి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement