కొంప ముంచిన కక్కుర్తి!
-
వానకు కొట్టుకుపోయిన మట్టి
-
నాణ్యత లోపాలే కారణం
-
కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం
-
పనులు పర్యవేక్షించని అధికార యంత్రాంగం
సాక్షిప్రతినిధి, వరంగల్ :
ఆధునీకరణలో భాగంగా ఎస్సారెస్పీ కాలువను పటిష్టం చేసే పనులు చేపట్టారు. గతంలో ఉన్న కాలువల మట్టి కొంత తీసి నాణ్యమైన మట్టిని పోయాల్సి ఉంది. కాంట్రాక్టర్ బయటి నుంచి మట్టిని తెచ్చి ఉపయోగించినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలతో ఆ మట్టి కొట్టుకుపోయి గండి పడిందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
భారీ వర్షాలు.. కొన్నిసార్లు అభివృద్ధి పనుల నాణ్యత లోపాలను కనిపించకుండా చేస్తాయి. ఇటీవల కురిసిన వర్షాలు మాత్రం పనుల్లో అక్రమాలను బహిర్గతం చేశాయి. దశాబ్దాలుగా భారీ వరదలను తట్టుకుని నిలిచిన కాలువ తాజా భారీ వర్షాలకు గండిపడడం... అదీ మరమ్మతులు చేసిన తర్వాత జరగడం నాణ్యత లోపాలను వెల్లడిస్తోంది. నాణ్యత లోపాల కారణంగా కాలువకు గండి పడిందని సాగునీటి శాఖ ఇంజనీర్లే చెబుతున్నారు. గండి పడిన ప్రాంతంలో చేపట్టిన పనులను ఇంజనీర్లు పర్యవేక్షించలేదని తెలుస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని జిల్లా వరకు సరఫరా చేసే ప్రధాన కాలువల్లో నిర్దేశిత సామర్థ్యం మేరకు నీటి సరఫరా జరగడం లేదు. కాలువలు పటిష్టంగా లేకపోవడం, నిర్మించి 15 ఏళ్లు పూర్తి కావడంతో సరిపడా నీటిని సరఫరా చేయలేక పోతున్నామని ఇంజనీర్ల చెప్పడంతో ప్రభుత్వం కోట్ల రుపాయలతో అధునీకరణ పనులను చేపట్టింది. ఈ పనులు పూర్తి చేశాక కూడా కాలువకు గండి పడడం అనేక విమర్శలకు తావిస్తోంది. పనులు జరిగిన సమయంలో ఇంజనీరింగ్ అధికారులు నాణ్యత ప్రమాణాలు పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలువకు కుడివైపు 5 మీటర్లు, ఎడమ వైపు 7మీటర్ల వెడల్పుతో పటిష్టం చేసే పనులు చేపట్టారు. గతంలో ఉన్న కాలువల మట్టి కొంత మేరకు తీసి ప్రమాణాలు కలిగిన మట్టిని పోయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా బయటి నుంచి మట్టిని తెచ్చి పటిష్టానికి ఉపయోగించినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలతో మట్టి కొట్టుకుపోయి గండి పడిందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కాలువ పటిష్టత కోసం మట్టిని లేయర్లుగా పోస్తూ, నీటిని చల్లుతూ, రోలింగ్ చేయాల్సి ఉండగా... నిధులు కొంత మిగిల్చికోవాలన్న ఉద్దేశంతో మొత్తం మట్టిని ఒకేసారి పోసి రోలింగ్ చేసినట్లు తెలిసింది. దీని వల్ల అడుగు భాగంలో గట్టిగా లేక మట్టి గుళ్లగా మారి భారీ వర్షాలకు కొట్టుకుపోయిందని తెలుస్తోంది. అధికారులు మాత్రం నాణ్యత లోపాలపై దృష్టి పడకుండా వ్యవహరిస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువై సీపేజీ(ఊట) రావడంతోనే ఇలా గండి పడిందని అంటున్నారు.
‘మూడో ప్యాకేజీ’లో గండి
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) ప్రధాన కాలువను పటిష్ట పరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్దేశిత సామర్థ్యం మేరకు ఎస్సారెస్పీ నీటి సరఫరా జరిగేలా కాకతీయ ప్రధాన కాల్వను మరమ్మతు చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించారు. కాలువలోని 191 కిలోమీటరు నుంచి 234 కిలోమీటరు వరకు పటిష్ట పరిచేందుకు రూ.60 కోట్లు అవవసరమని రూపొందించిన అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పనులను నాలుగు ప్యాకేజీలుగా చేపట్టేందుకు అధికారులు టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. కాకతీయ కాలువ 191 కిలో మీటరు నుంచి 201 కిలో మీటరు, 201 కిలో మీటరు నుంచి 209 కిలో మీటరు, 209 కిలో మీటరు నుంచి 226 కిలో మీటరు, 226 కిలో మీటరు నుంచి 234 కిలో మీటరు ప్యాకేజీలు విభజించి టెండర్లు పూర్తి చేశారు. ఎండా కాలంలో నాలుగు ప్యాకేజీల్లో పనులు పూర్తి చేశారు. మూడో ప్యాకేజీగా పేర్కొన్న 209 కిలో మీటరు నుంచి 226 కిలో మీటరు కాలువకు బుధవారం గండి పడింది. ఎస్సారెస్పీ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుధాకర్‌రెడ్డి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గండిని మట్టితో పూడ్చినప్పటికీ ప్రవాహం ఎక్కువ అవుతుండడంతో కాలువ కట్ట తెగే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఇసుక బస్తాలతో కట్ట ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.