రాష్ట్రాన్ని కాపాడేది కాంగ్రెేస్సే..
♦ వరంగల్, ఖమ్మం రైతు భరోసా యాత్రలో కె.జానారెడ్డి
♦ హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది
♦ నెపం గత ప్రభుత్వాలపై వేయాలని చూస్తోంది
♦ రైతుల రుణాలు ఒకే విడతలో మాఫీ చేయాలి
సాక్షి, హన్మకొండ/ఖమ్మం: ‘‘తెలంగాణ తెచ్చింది మా పార్టీ.. తెలంగాణను రక్షించేది కూడా మా పార్టీయే..’’ అని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, గత ప్రభుత్వాలపై నెపంవేసి ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తోందంటూ మండిపడ్డారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం కాంగ్రెస్ ఖమ్మం, వరంగల్ జిల్లాలో రైతు భరోసా యా త్ర చేపట్టింది. వరంగల్ జిల్లా నర్సంపేటలో బహిరంగ సభ నిర్వహించారు.
కార్యక్రమంలో జానారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రజల చేతిలో పెడితే, ప్రజలు దాన్ని టీఆర్‌ఎస్ చేతిలో పెట్టి మోసపోయారని అన్నారు. ఇంకా వేచి చూస్తే గ్రామాలకు గ్రామాలే అన్యాయానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అందువల్లే రైతుల తరఫున పోరాడుతూ ప్రజల్లో చైతన్యం పెంచేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చిందన్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శనివారం తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.
మాఫీ పక్కనపెట్టి... గ్రిడ్‌కు వేల కోట్లా?
రుణమాఫీని పక్కనపెట్టి సీఎం కేసీఆర్ వాటర్‌గ్రిడ్ పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్త రాష్ట్రంలో సంబరాలు చేసుకోవాల్సిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రతీరోజు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వం.. దున్నపోతుపై వర్షం పడ్డట్లుగా వ్యవ హరిస్తోందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు.
కార్యక్రమంలో మాజీ మంత్రులు డీకే అరుణ, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సారయ్య, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎంపీలు మధుయాష్కీ, సిరిసిల్ల రాజయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట నియోజకవర్గం పరిధిలో ఆత్మహత్య చేసుకున్న ఎనిమిది మంది రైతు కుటుంబాలకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆర్థిక సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల సాయం అందజేశారు. అంతకుముందు ఖమ్మం జిల్లాలో భరోసా యాత్ర నిర్వహించిన కాంగ్రెస్ నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ర్టంలో ప్రతి మూడు గంటలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడని, ఇంత జరుగుతున్నా.. సీఎం పట్టించుకోవడం లేదన్నారు.