దివ్యాంగులకు సేవ చేయడం అదృష్టం
– కర్నూలు డయాసిస్ బిషప్ పూల ఆంథోని
అయ్యలూరుమెట్ట (నంద్యాలరూరల్): దివ్యాంగులకు సమాజంలో వారికి గౌరవ స్థానం కల్పించడం అదృష్టంగా భావించాలని కర్నూలు డయాసిస్ బిషప్ మోస్ట్ రైట్ రెవరెండ్ పూల ఆంథోని అన్నారు. అయ్యలూరు మెట్ట నవజీవన్ బధిరుల పాఠశాల వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బిషప్ పూల ఆంథోని మాట్లాడుతూ ఏసుప్రభువు చూపిన ప్రేమ, దయ, కరుణతో 39 సంవత్సరాలు విచారణ గురువుగా సేవలు అందిస్తున్న ఫాదర్ మర్రెడ్డి సేవలు మరువలేనివన్నారు. పెద్దకొట్టాలలో శారీరక వికలాంగుల ఆశ్రమం, గోపవరం వద్ద మానసిక వికలాంగుల ఆశ్రమం, అయ్యలూరు మెట్ట వద్ద మూగ, చెవిటి పిల్లల ప్రత్యేక పాఠశాలను నెలకొల్పి వికలాంగులకు వసతితో పాటు విద్యను అందించడం దేవుడు ఆయనకు ఇచ్చిన గొప్పవరం అన్నారు.
జేఎంజే సంస్థ పర్య అధినేత సిస్టర్ సెలీనా ఆలాపాట్ కూడా దైవ కన్యగా నిలుస్తూ 50 సంవత్సరాలుగా దైవ మార్గంలో విద్యార్థులకు, సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని సేవాదృక్పథం పెంచుకోవాలని సూచించారు. అనంతరం బిషప్ పూల ఆంథోని, సిస్టర్ సెలీనా ఆలాపాట్, ఫాదర్ మర్రెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్ రాజమ్మ, పెద్దకొట్టాల ఆర్‌సీఎం చర్చి విచారణ గురువు ఏర్వ జోజిరెడ్డి, ప్యారీస్ క్రీస్ ఫాదర్ సురేష్, నవజీవన్ డీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ నారపురెడ్డి, ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతమ్మ, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం రాజశేఖర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు:
పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా నవజీవన్ విద్యార్థుల నాటికలు, సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాటం నృత్యం, చెక్కభజన, ఆహుతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏసుప్రభువు జీవిత ఘట్టం, గ్లోరిగ్లోరి దేవుని మహిమ గీతం, ప్రేమసింధు, పరమాత్మ నీవనే అనుక్రమ గీతం, అల్లేలూయ గీతాలకు బధిర విద్యార్థుల ప్రదర్శన శభాష్ అనిపిచింది. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.