పోలీసులపై ప్రైవేటు కేసు!
ఎస్‌ఐపై చేయి చేసుకోలేదన్న మాధవరెడ్డి
అనంతపురం సెంట్రల్ : తనను దారుణంగా కొట్టి, అక్రమ కేసులు బనాయించిన అనంతపురం టూటౌన్ పోలీసులపై ప్రైవేట్ కేసు పెడతానని బాధితుడు కేంద్రీయ వాతావరణ కేంద్రం ఉద్యోగి మాధవరెడ్డి తెలిపారు. ఈ నెల 13న సాయినగర్ ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచి వద్ద టూటౌన్ ఎస్‌ఐ జనార్దన్‌పై చేయి చేసుకున్నారనే కారణంతో మాధవరెడ్డిని పోలీసులు చుట్టుముట్టి లాటీలతో కొట్టి.. అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో రెండురోజుల పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒండి నిండా గాయాలతో ఉన్న మాధవరెడ్డి బుధవారం చికిత్స కోసం సర్వజనాస్పత్రికి వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ఎస్‌ఐపై చేయి చేసుకోలేదని, కొడుతుంటే చేయి అడ్డుగా పెట్టానని స్పష్టం చేశారు. తనను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఎస్‌ఐతో పాటు పది మంది కానిస్టేబుళ్లు దారుణంగా కొట్టారని విలపించారు. తాను ప్రభుత్వ ఉద్యోగినని, చట్టం అంటే గౌరవం ఉందని అన్నారు. తనపై మూడు సెక‌్షన్‌ల కింద కేసు నమోదు చేశారని తెలిపారు. తనపై బనాయించిన అక్రమకేసులు కొట్టేసేలా ఎస్పీ చొరవ తీసుకోవాలని కోరారు. పోలీసులపై ప్రైవేటు కేసు పెట్టడంతో పాటు మానవహక్కుల కమిషనన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
దెబ్బలు బాగా తగిలాయి
మాధవరెడ్డికి దెబ్బలు బాగా తగిలాయని సర్వజనాస్పత్రి ఆర్థో వైద్యులు గౌస్ తెలిపారు. అన్నింటికీ ఎక్స్‌రేలు తీయించామని, రేపు ఉదయం వచ్చే రిపోర్టులను బట్టి పరిస్థితిని తెలియజేస్తామన్నారు. ఎక్కువశాతం బెడ్‌రెస్ట్ అవసరమవుతుందిదని చెప్పారు.
నా భర్తకు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత
నా భర్తకు ప్రాణహాని ఉంది. నా భర్తకు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత. సభ్యసమాజం తలదించుకునేలా పోలీసులు నా భర్తను కిరాతకంగా కొట్టారు. పైగా అక్రమంగా కేసులు నమోదు చేశారు. నాకు, నాభర్తకు న్యాయం చేయాలి.
- భార్గవి, మాధవరెడ్డి భార్య