జారి పడి వ్యక్తి మృతి
హిందూపురం అర్బన్ : హిందూపురం పట్టణ శివారులోని మోత్కుపల్లి బ్రిడ్జి కింద జారి పడి తలకు బలమైన గాయాలు కావడంతో ముక్కిడిపేటకు చెందిన చంద్ర (32) బుధవారం మృతి చెందాడు. వివరాలు.. మంగళవారం మోత్కుపల్లిలోని ముత్యాలమ్మ జాతరకు హాజరైన చంద్ర స్నేహితులతో కలిసి బ్రిడ్జి వద్ద విందులో పాల్గొన్నాడు. అనంతరం బ్రిడ్జి కింద నడుస్తూ జారి పడటంతో తలకు మొద్దు తగిలింది. తీవ్ర రక్తస్రావంతో పడిపోవటంతో అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన బెంగళూరుకు తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. కాగా రెండేళ్ల క్రితం ఇతని సోదరుడు వినాయకచవితి పండుగ సమయంలో నిమజ్జన కార్యక్రమంలో గుండెపోటుతో మృతిచెందారు. ఇప్పుడు మరో కుమారుడు కూడా ఇలా అర్థంతరంగా మృతి చెందటంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తనకు తలకొరివి పెట్టాల్సిన కొడుకులకు తానే కొరివి పెట్టాల్సి వచ్చిందని చంద్ర తండ్రి బంధువుల వద్ద కన్నీరుమున్నీరు అవుతున్నాడు. చంద్రకు భార్య, కూతురు ఉంది.