లంగర్‌హౌస్: అధికారులకు పోలీసు భద్రత, గన్‌మెన్లు ఉండరు... వారికి ఆ సమయంలో ఏదైనా కావచ్చని గోల్కొండ తహసీల్దార్, వీఆర్‌ఓను ఉద్దేశించి కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ అన్నారు. వివరాలు... లంగర్‌హౌస్ డిఫెన్స కాలనీలో మూసీ పరివాహక ప్రాంతంలో టీఎస్ నెంబర్ 1–3 లో దాదాపు 1500 గజాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. గోల్కొండ మండల తహసీల్దార్ చంద్రకళ రెండు రోజుల క్రితం తన సిబ్బందితో అక్కడికి వెళ్లి అక్రమ కట్టడాలను కూల్చేశారు.
ఈ విషయమై ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్.. వీఆర్‌ఓ, సర్వేయర్ షహీద్‌కు ఫోన్ చేసి బెదిరించారు. నువ్వు మా మతం వాడివేనా? అంటూ తిట్టారు. ఒక వైపు తమకు ప్లాన్ చెప్పి... మరో వైపు అధికారికి ఇది కబ్జా స్థలం అని చూపించి కూల్చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రేపటి నుంచి ఉద్యోగం ఎలా చేస్తావు చూస్తా?.. ఏసీబీకి పట్టించి జైలుకు పంపిస్తానన్నారు.
అంతేకాకుండా.. మీకు పోలీసులుగాని, గన్‌మెన్లుగానీ వెంట ఉండరని ఆ విషయం గుర్తుపెట్టుకొని నడుచుకోవాలని హెచ్చరించారు. నిజామాబాద్ నుంచి వచ్చిన తహసీల్దార్‌కు ఇక్కడి పరిస్థితులు ఏమి తెలుసు? తహసీల్దార్ మేడమ్ చూసి చూడనట్లుగా ఉండమని చెప్పాలంటూ ఫోన్ లో చెప్పారు.
అయితే... ఈ విషయమై ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్న అధికారులు, ఎమ్మెల్యే దూషిస్తున్న సమయంలో రికార్డు చేసిన ఫోన్ వాయిస్‌ను మీడియాకు అందించారు. ఈ వాయిస్ రికార్డు వాట్సాఫ్ గ్రూప్‌ల్లో కూడా హల్‌చల్ చేస్తుంది. కాగా, ఈ విషయం అధికారులను ఆరా తీసేందుకు ప్రయత్నించగా ఎవ్వరూ అందుబాటులోకి రావడంలేదు.