నేనసలే పిచ్చోడిని... రెచ్చగొట్టకండి
ఎమ్మెల్యేను నిలదీసిన మహిళపై సహనం కోల్పోయిన వర్మ
కొత్తపల్లి : ప్రజా ప్రతినిధిని సమస్యలపై నిలదీసే హక్కు ప్రజలకు ఉంది. సహనంగా సమాధానం చెప్పాల్సిన ప్రజాప్రతినిధే సహనం కోల్పోతే. అదే జరిగింది కొత్తపల్లి మండలంలో. తన సమస్యలను చెప్పుకుంటున్న ఓ మహిళపై పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ‘నేను అసలే పిచ్చోడిని...నన్ను రెచ్చగొట్టొ’’ద్దంటూ సభలోనే చిర్రెత్తిపోవడంతో అక్కడున్నవారంతా ముక్కున వేలేసుకున్నారు. కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించింన ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ గ్రామాల అభివృద్ధికి కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, అర్హులైన వారందరికీ పింఛన్లు అందిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. దీంతో కొత్తపల్లి ఎస్సీపేటకు చెందిన ఒక మహిళ నిలబడి సమస్యలపై ఎమ్మెల్యే వర్మను నిలదీసింది. రోడ్లు సామాన్య ప్రజల ఇళ్ళ వద్ద కాకుండా తమ పార్టీ నాయకులు ఇళ్ళ వద్దే వేసుకుంటున్నారని, వర్షం వస్తే మా వీధిలో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతుందని, తన కుమారుడు చనిపోయి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్నా తన కోడలకు పింఛను మంజూరు చేయలేదని నిలదీయడంతో సర్దిచప్పాల్సిందిపోయి ‘నేను అసలే పిచ్చోడిని నన్ను రెచ్చగొట్టొ‘ందంటూ పలుమార్లు కూర్చో కూర్చోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకపల్లికి చెందిన టి.మంగకు పింఛను మంజూరైందని చెప్పి సభకు రప్పించారు. కొత్త పింఛను వస్తుందని ఆశగా వచ్చిన ఆమెకు పింఛనును మంజూరు కాలేదని చెప్పడంతో ఆమె సభలోనే కన్నీళ్ళపర్యంతమైంది.