కసిపెంచిన కష్టాలు
♦ అడ్డా కూలీ బిడ్డకు రాష్ట్రస్థాయి ర్యాంకు
♦ పేదింట విరిసిన కుసుమం...మౌనిక
♦ పట్టుదలే పునాదిగా రాణింపు
♦ కష్టాలు వెంటాడుతున్నా అద్వితీయ ప్రతిభ
♦ ఇంటర్‌లో 987(ఎంపీసీ) మార్కులతో..
♦ రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు కైవసం
గజ్వేల్/కొండపాక: తండ్రి ఓ అడ్డా కూలీ... తల్లి బీడీ కార్మికురాలు... కేవలం రెండెకరాల మెట్ట పొలం.. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి.. ఇవన్నీ ఆ విద్యార్థి లక్ష్యానికి అవరోధంగా మారలేదు. తనను ఉన్నత స్థానంలో నిలబెట్టాలనే తల్లిదండ్రుల ఆశను తీర్చడానికి నిరంతరం శ్రమించింది. ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతూ సెలవులు వచ్చినప్పుడల్లా కూలీ పనులకు వెళ్లి తల్లిదండ్రులకు అండగా నిలిచింది. కసిగా చదివి తాజాగా శుక్రవారం విడుదలైన ఇంటర్(ఎంపీసీ) 987/1000మార్కులతో రికార్డు సృష్టించింది. కష్టాలే తనలో విజయకాంక్షను రగిల్చాయని ఆ విద్యార్థిని చెబుతోంది. ఈ సందర్భంగా శనివారం ‘సాక్షి’తో తన అంతరంగాన్ని ఆవిష్కరించింది. ఆ వివరాలు..కొండపాక మండలం ధమ్మక్కపల్లి గ్రామానికి కూరాటి నర్సింలు.
యాదమ్మకు మౌనిక(17), జ్యోతి(14), ప్రసాద్(13), మధు(9)లు సంతానం. నర్సింలు రెండెకరాల ఆసామి. వరుసగా నాలుగు బోరుబావులు వేసినా అవి ఫెయిల్ కావడంతో ఆశలు చాలించుకొని..ఆ భూమిలో ఏటా పత్తి, మొక్కజొన్న లాంటి మెట్టపంటలు సాగు చేసుకుంటున్నాడు. మూడేళ్లుగా కాలం కలిసి రాక వ్యవసాయంపై ఆశలు చాలించుకొని...అడ్డా కూలీగా స్థిరపడ్డాడు. గ్రామంలోని ఓ మేస్త్రీ వద్ద పనికెళ్తున్నాడు. గ్రామం చుట్టు పక్కల.. లేదంటే సిద్దిపేటకు పనికి వెళ్తుంటాడు. పనికి వెళ్లనిదే పూట గడిచే పరిస్థితి లేదు. నిత్యం పని వెతుక్కుంటాడు. యాదమ్మ బీడీలు చుడుతుంది.
మౌనిక కొండపాకలోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో చదువుతోంది. ఇంటర్ చదువుతున్న మౌనికకు పేదరికం ఏనాడూ అవరోధంగా మారలేదు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి మాత్రం మౌనిక చలించిపోయింది. నిత్యం విజయకాంక్షతో రగిలిపోయింది. ఇంటర్ ఎలాగైనా రాష్ట్రస్థాయి ర్యాంకును సాధించాలనే తపనతో ముందుకు సాగింది. ఇందుకోసం ప్రణాళికబద్ధంగా శ్రమించింది. తల్లిదండ్రులకు తోడూ అధ్యాపకుల ప్రోత్సాహం లభించడంతో లక్ష్యాన్ని సాధించడానికి బాటలు వేసుకుంది. ఈ క్రమంలోనే శుక్రవారం విడుదలైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 987/1000 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకును సాధించి అందరినీ అబ్బురపరిచింది.
ఐఏఎస్ కావడమే లక్ష్యం
చిన్నప్పటి నుంచి కష్టాల్లో పుట్టిపెరిగాను. నేను బాగా చదువుకోవాలని నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్లికిక కష్టాలుండొద్దు. ఐఏఎస్ సాధించాలనేదే నా జీవిత లక్ష్యం. పాఠశాలలో నన్ను మ్యాథ్స్ లెక్చరర్ అక్బర్ సార్, ప్రిన్సిపాల్ జ్యూటికా వన్నీసా మేడమ్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి సహకారం జీవితంతో మరిచిపోలేను.
చురుకైన విద్యార్థిని
మా విద్యా సంస్థలో మౌనిక చాలా చురుకైన అమ్మాయి. ఇలాంటి విద్యార్థిని మా విద్యాసంస్థలో ఉన్నందుకు సంతోషించేవాళ్లం. పాఠాలు శ్రద్ధగా వినేది. చదువులో ఎప్పుడూ ముందుండేది. - జ్యూటికావన్నీసా, ప్రిన్సిపాల్
ఏకసంతాగ్రహి
మౌనిక లాంటి విద్యార్థినులు చాలా అరుదు. ఏ విషయం చెప్పినా బాగా గుర్తు పెట్టుకునేది. ప్రతి పరీక్షలోనూ మొదటి స్థానం సాధించేది. ఎన్ని ఇబ్బందులున్నా బాధపడేది కాదు. దిగమింగుతూ లక్ష్యాన్ని సాధించింది. ఈ అమ్మాయి ఎందరికో స్ఫూర్తినిచ్చింది.
- షేక్ అక్బర్, మ్యాథ్‌స లెక్చరర్
కష్టాలను లెక్కచేయ..
నా బిడ్డ ఎప్పుడూ కూడా కష్టాలున్నాయని చదవడం ఆపేయలేదు. మేము ఉపాసముంటే తనూ ఉపాసముంది. మాతోపాటు ఎన్నో సార్లు కూలీ పనులకు వచ్చింది. మా కష్టంలో పాలు పంచుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా బిడ్డ చదువు ఆపేయ. ఆమెను కలెక్టర్‌ను చేస్తానని మాట ఇచ్చిన. దీనికి ఎంతైనా కష్టపడుతా. నా బిడ్డకోసం కష్టపడడంలో ఎంతో ఆనందముంది.
- మౌనిక తండ్రి కూరాటి నర్సింలు