ముద్రగడకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తున్నాం
ఆయన డిమాండ్లకు ప్రభుత్వం సానుకూల స్పందన
తూర్పుగోదావరి కలెక్టర్, విశాఖ రేంజి డీఐజీల వెల్లడి
రాజమండ్రి
కాపు రిజర్వేషన్లు, తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలన్న డిమాండ్లతో ఏడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన ముద్రగడ పద్మనాభానికి ప్రస్తుతం ఐవీ ఫ్లూయిడ్లు ఇస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, విశాఖ రేంజి డీఐజీ శ్రీకాంత్ మీడియాకు తెలిపారు.
ప్రభుత్వ సూచనల మేరకు ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపామని, తుని ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారని, అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని కలెక్టర్ అరుణ్ కుమార్, డీఐజీ శ్రీకాంత్ తెలిపారు. ఇప్పటివరకు తుని ఘటనలో అరెస్టు చేసిన 13 మందికి బెయిల్ ఇప్పించేందుకు ప్రభుత్వం న్యాయ నిపుణులను సంప్రదిస్తోందని అన్నారు. అయితే ఈ విషయమై కాపు జేఏసీ వైపు నుంచి గానీ, ముద్రగడ కుటుంబ సభ్యుల వైపు నుంచి గానీ ఎలాంటి సమాచారం లేదు.