దళితులపై దాడులు నిరసిస్తూ ధర్నా
గాంధీనగర్ :
ఆర్‌ఎస్‌ఎస్ వంటి మతోన్మాద సంస్థలు దళితులపై దేశవ్యాప్తంగా జరుపుతున్న దాడులను నిరసిస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం లెనిన్‌సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. నగర కార్యదర్శి కె. పోలారి మాట్లాడుతూ చుండూరు మారణకాండ జరిగి నేటికి 25 సంవత్సరాలు పూర్తయిందన్నారు. కానీ దోషులెవ్వరికి శిక్షలు పడలేదని చెప్పారు. వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని ఆయన ఖండించారు. చుండూరు విషయంలోనే కాక కారంచేడు, పదిరికుప్పం, నీరుకొండ, లక్ష్మీంపేట తదితర ఘటనలలో దళితులకు న్యాయం జరగలేదన్నారు. ప్రస్తుతం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల, మతోన్మాదాన్ని మరింత పెంచి పోషిస్తున్నారన్నారని చెప్పారు. గో రక్షణ పేరుతో దళితులపై, మైనార్టీలపై దాడులు చేస్తున్నారన్నారు. జంతువులకు ఉన్న విలువ దళితుల ప్రాణాలకు లేకుండా పోయిందన్నారు. దళితులపై దాడులు, మతోన్మాదం నశించాలన్నారు. ధర్నాలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమాక్రసీ నాయకులు కె. దుర్గ, వై. అప్పారావు, గౌతమ్, ఇఫ్టూ నాయకులు శ్రీధర్, యాదగిరి పాల్గొన్నారు.