ఆన్‌లైన్ కలవరం
ఏటీఎంలో విత్‌డ్రాపై అవగాహనలేని గిరిజనులు
నగదు రహిత లావాదేవీలతో మరింత మోసపోయే అవకాశం
చింతపల్లి: ఆదివాసీ గిరిజనుల్లో 80 శాతం మేర నిరక్షరాస్యులున్నారు. వీరు ఏటీఎంలనుంచి డబ్బులు తీసుకోవడంపై ఏమాత్రం అవగాహన లేదు. ఎంత సమయం పట్టినా క్యూలో నిలబడి డబ్బులు తీసుకుంటారే తప్ప ఏటీఎంలను వినియోగించరు. ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలకు తెరలేపడంతో అమాయక గిరిజనుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుంది. గిరిజనులు పండించిన సరుకులు సంతకు తీసుకు వెళ్లి విక్రయిస్తేనే వ్యాపారులు తూనికల్లో ఘోరంగా మోసం చేస్తున్నారు.కార్డులు పట్టుకుని సరుకులు కొనుక్కోవాలంటే మరింత మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. డబ్బులు పట్టుకుని సరకులకోసం దుకాణాల వద్దకు వెళితే రూ.100 ఖరీదు గల సరుకులు ఇచ్చి అదనంగా ఎంతో కొంత మోసం చేస్తున్నారు.
ఇప్పుడు కార్డులు ఇచ్చి సరుకులు కొంటే కార్డు నుంచి సదరు వ్యాపారి ఎంత సొమ్ము అతని ఖాతాలోకి జమ చేసుకుంటున్నాడో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గిరిజనులు మరింత మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. మైదానానికి చెందిన గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా మందికి ఏటీఎంల్లో డబ్బులు తీసుకోవడం తెలియదు. చాలా సందర్భాల్లో పక్కనున్న వారిని బతిమాలి నగదు తీసుకుంటారు. కార్డులకు సంబంధించిన పిన్ నంబర్లు పరాయి వాళ్లకు తెలిస్తే ఖాతాల్లో ఖాళీ అవుతున్న ఈ రోజుల్లో నగదు రహిత లావాదేవీల కోసం ఆదివాసీలు ఇతరులను ఆశ్రయించినా ప్రమాదమే. మొత్తం మీద నగదు రహిత లావాదేవీలు అమాయక గిరిజనులకు శాపంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆందోళన కలిగిస్తుంది
సంతకు వెళ్లి డబ్బులు ఇచ్చి సరుకులు కొంటేనే మోసం చేస్తున్నారు. అక్షరంముక్క రాని మాలాంటి వాళ్లం కార్డులతో ఎలా కొనుగోలు చేయగలం. నగదు రహిత లావాదేవీలు వల్ల ఇబ్బందులు తప్పవు.
- కొర్రా సింగారి, బెన్నవరం, చింతపల్లి మండలం
ఏటీఎంలు వాడటం లేదు
చదువుకోక పోవడం వల్ల ఏటీఎం కార్డు తీసుకోలేదు.బ్యాంకులో ఎంత సమయం పట్టినా వరుసలో నిలబడి డబ్బులు తీసుకుంటాను. నగదు రహిత లావాదేవీలకు సంబంధించి కార్డులు ఉపయోగించాలంటే ఇబ్బందులు తప్పవు.
- గెమ్మెలి రాజారావు, పీకే గూడెం, జీకేవీధి మండలం