పెత్తనమంతా వాళ్ల 'అనుచరులదే' | No powers to some TDP leaders in krishna district | Sakshi
Sakshi News home page

పెత్తనమంతా వాళ్ల 'అనుచరులదే'

Published Thu, Jan 28 2016 11:20 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

పెత్తనమంతా వాళ్ల 'అనుచరులదే' - Sakshi

పెత్తనమంతా వాళ్ల 'అనుచరులదే'

పెనమలూరులో ఎమ్మెల్యే వర్గీయులదే హవా
ఇబ్రహీంపట్నంలో మంత్రి వర్గీయులదే పెత్తనం
కైకలూరులో సీఎం సామాజిక వర్గానిదే  పైచేయి

 
విజయవాడ : బీసీలు, ఎస్సీ, ఎస్టీలే పార్టీకి అండ...వారికే ఉన్నత పదవులు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు నిత్యం ఊదర కొడుతుంటారు. రిజర్వేషన్ ద్వారా ఆ పార్టీ తరపున ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఎస్సీ, ఎస్టీ, బీసీలు కీలుబొమ్మలుగా మారుతున్నారు. సీఎం సామాజిక వర్గానికి చెందిన వారే పెత్తనం చేస్తున్నారు. అవమానాలను పైకి చెప్పుకోలేక..ఎదురు తిరగలేక అంతర్మధనం చెందుతున్నారు. కొందరు చేసేది లేక పదవులు వదులుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే అందుకు ఉదాహరణ..
 
జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో పలువురు తెలుగుదేశం పార్టీ తరపున స్థానికసంస్థల ఎన్నికల్లో గెలుపొందారు. మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీపట్నం ఎంపీపీగా తెలుగుదేశం పార్టీ తరపున ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చీతిరాల ప్రసూన గెలుపొందారు. ఆమె పదవి చేపట్టిన రోజు నుంచి మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు వర్గీయులు పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రతి మీటింగ్‌లోనూ వైస్ ఎంపీపీ చెరుకూరి వెంకటకృష్ణారావు తెరపై కనిపిస్తారు.
 
ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ సభ్యురాలు చెన్నుబోయిన రాధ పరిస్థితి కూడా ఇదే. ఈమెకు తెలుగుదేశం పార్టీ నేతలు కనీస గుర్తింపు ఇవ్వడం లేదు. మంత్రి కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయి. జిల్లా ప్రజాపరిషత్ సమావేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈమె కూడా మంత్రి తీరుపై విసిగిపోయింది. ఇబ్రహీంపట్నం సర్పంచ్‌గా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అజ్మి స్వర్ణ గెలుపొందారు. ఈమె పేరుకే సర్పంచ్, పెత్తనం మాత్రం మంత్రి వర్గీయులదే. అందుకే ఈమె కూడా తన పదవికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని మంత్రి వర్గీయులపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
 
వీరు ముగ్గురు ఇటీవల జరిగిన జన్మభూమి సభను బహిష్కరించారు. తమ పదవులను గౌరవించని వారి వద్దకు తాము వచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇంతటి అవమానం భరిస్తూ ఎలా పనిచేయాలనే ఆవేదన వీరి మనస్సుల్లో ఉంది. అందుకే వారు సభలను బహిష్కరించి నిరసన తెలిపారు.
 
పెనమలూరు ఎంపీపీ రాజీనామా
 పెనమలూరు ఎంపీపీ బొర్రా కనకదుర్గ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. మహిళలకు ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చిన కోటాలో ఎంపీపీగా ఎన్నికైంది. మహిళలకు ఇస్తున్న గౌరవానికి సంబరపడిపోయింది. ఎంపీపీగా మండలంలో అనుకున్నవి చేయవచ్చని భావించింది. పైగా అధికార పార్టీ తరపున ఎంపీపీగా ఉన్నందున నిధులు కూడా ఎక్కువ రాబట్టుకోవచ్చని ఆమె చేసిన ఆలోచనలు కల లుగా మిగిలాయి.
 
 స్వతంత్ర నిర్ణయాలు పనికి రావని, పాలకవర్గం తీసుకునే నిర్ణయాలు ఇక్కడ విశ్వసించే వారు లేరని ఎమ్మె ల్యే బోడె ప్రసాద్ వర్గీయులు ఆమెకు తెలియజెప్పారు. ఆమెలో ఆవేదనతోపాటు సహనం చచ్చిపోయింది. ఎవరిని నిందించాలో అర్థం కాక తన ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తున్నానని లేఖను ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు అందజేసింది.
 
కైకలూరులో అసంతృప్తి
కైకలూరు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ప్రముఖులకు నామినేటెడ్ పదవులు ఇవ్వడంపై టీడీపీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కైకలూరు వ్యవసాయ మార్కెట్ యార్డు జిల్లాలోనే గుర్తింపు ఉన్నది. ఈ యార్డుకు చైర్మన్‌గా సీఎం సామాజికవర్గానికి చెందిన చింతపల్లి వీరరాజేశ్వరిని నియమించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ముదినేపల్లి మండలానికి చెందిన ఈడ్పుగంటి వెంకట్రామయ్యను నియమించారు.
 
జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో నిరసన
జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలపై అగ్రవర్ణాల పెత్తనం సాగుతున్నదనే ఆందోళన నెలకొంది. బలహీనవర్గాల నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిని అవమానించే విధంగా అగ్రవర్ణ నాయకులు వ్యవహరిస్తున్నారని, ఇది సీఎం అండదండలతోనే జరుగుతున్నదనే ఆలోచనలో వీరు ఉన్నారు. కొందరు అగ్రవర్ణ ఎమ్మెల్యేలు చేపట్టిన చర్యలు దీనిని రుజువు చేస్తున్నాయి. త్వరలో బీసీ, బలహీనవర్గాల ప్రజాప్రతినిధుల సదస్సు విజయవాడలో నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement