ప్రయాణికులకు విజయవాడ కష్టాలు | no vijayawada bound trains to vijayawada | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు విజయవాడ కష్టాలు

Published Fri, Sep 23 2016 10:11 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

ప్రయాణికులకు విజయవాడ కష్టాలు

ప్రయాణికులకు విజయవాడ కష్టాలు

  • బోసిపోయిన విశాఖ రైల్వే స్టేషన్
  • పలు రైళ్లు రద్దు... మరికొన్ని దారి మళ్లింపు
  • అరగంట ముందు వస్తేనే పూర్తి చార్జి చెల్లింపు...  లేకుంటే 15 రోజుల తర్వాతే
  • నేడు, రేపు రత్నాచల్ రద్దు
  • ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ బస్సులు
  • వాటిపై ఆసక్తి చూపని  ప్రయాణికులు
  •  
    విశాఖపట్నం : విజయవాడ రైల్వేస్టేషన్లో సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ విశాఖ నుంచి బయల్దేరే ప్రయాణికులకు శాపంగా మారిందనే చెప్పుకోవాలి. బుధవారం నుంచి పలురైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయడం.. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించడంతో ప్రయాణికుల కష్టాలు రెట్టింపయ్యాయి. ఏకంగా తొమ్మిది రోజుల పాటు ఈ కష్టాలు ఉండే పరిస్థితులు తలెత్తడంతో సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు ఈ పరిస్థితి ఉంటుందని రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు.
     
     విజయవాడ వైపు వెళ్లే మెజార్టీ రైళ్లన్నీ రద్దుకావడం.. మరికొన్ని రైళ్లు దారి మళ్లించడంతో విశాఖ రైల్వే స్టేషన్ గురువారం బోసిపోయింది. దారి మళ్లించిన రైళ్లతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ ఏ సమయానికి చేరుకుంటాయో కూడా రైల్వే అధికారులు చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి.
     
     పరిస్థితి ఇలా ఉంటుందని నిన్న స్టేషన్‌కు చేరుకున్న వారంతా రిజర్వేషన్లను రద్దు చేసుకుని అందుబాటులో ఉన్న రైళ్లలోనే రాకపోకలు సాగించారు. కాగా గురువారం మాత్రం పరిస్థితి పూర్తిగా అవగతం కావడంతో ప్రయాణికులంతా ఆన్‌లైన్‌లో కొంతమంది.. నేరుగా కొంతమంది తమ రిజర్వేషన్లను రద్దు చేసుకుని తిరుగుముఖం పట్టారు. దీంతో ప్లాట్‌ఫారమ్స్ ఖాళీగా దర్శన మిచ్చాయి. రైల్వే స్టేషన్‌లో బంద్ వాతావరణం కనిపించింది.
     
     రద్దయిన రైళ్లకు పూర్తి చార్జి చెల్లింపు
     పూర్తిగా.. పాక్షికంగా రద్దయిన రైళ్లకు రిజర్వేషన్ చేయించుకున్న వారికి ట్రైన్ బయల్దేరే అరగంట ముందు వస్తే పూర్తి సొమ్ము చెల్లిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. ట్రైన్ షెడ్యూల్ టైం తర్వాత రద్దు చేసుకుంటే నగదు చెల్లించడానికి కనీసం 15 నుంచి నెల రోజుల సమయం పడుతుందని స్పష్టం చేసింది. దారి మళ్లించిన రైళ్లకు మాత్రం ఇది వర్తించదని ప్రకటించింది.
     
     విజయవాడ వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి ట్రైన్‌కు గుణదల, రాయన్నపాడు స్టేషన్‌లలో దిగేందుకు ప్రత్యేకంగా స్పెషల్ హాల్ట్ ఇస్తున్నారు. ఇక్కడ దిగిపోతే విజయవాడ  సిటీలోకి ఫ్రీగా తీసుకెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. కాగా రేపు బయల్దేరనున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు హైదరాబాద్ నుంచి వచ్చే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లను కూడా పూర్తిగా రద్దు చేసినట్టు చెప్పారు.
     
     బస్సులపై ఆసక్తి చూపని ప్రయాణికులు
     
     రైల్వేస్టేషన్‌లో విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికుల కోసం ఈ రోజు 12 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అయితే మెజార్టీ ప్రయాణికులు బస్సుల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో నాలుగు బస్సులకు సరిపడా ప్రయాణికులు మాత్రమే ఎక్కడంతో వాటిని విజయవాడ పంపారు.
     
     మిగిలిన బస్సులు తిరిగి డిపోకు వచ్చేశాయి. రేపటి నుంచి ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి అదనంగా ఒకటి రెండు బస్సులు నడిపే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఎక్కువ రద్దీ ఉండే రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్లకు మాత్రం ప్రత్యామ్నాయంగా బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే ఏ సూపర్‌ఫాస్ట్ ట్రైన్‌కైనా విశాఖ నుంచి విజయవాడకు వెళ్లేందుకు రూ.160లకు మించి ఖర్చు అవదు. అదే ఆర్టీసీ బస్సు ఎక్కితే నాలుగింతలు వదిలిపోతుంది. సూపర్ లగ్జరీకైతే రూ.500, అల్ట్రా డీలక్స్‌కైతే రూ.400, ఇంద్రకైతే రూ.600లకు పైగానే చార్జీ వసూలు చేస్తారు.
     
     ఇంత భారీ ఎత్తున జేబులకు చిల్లులుపడే పరిస్థితి నెలకొనడంతో అత్యవసరమైతే తప్ప ఈ వారం రోజులు విజయవాడ వైపు వెళ్లకపోవడమే మంచిదన్న భావనలో మెజార్టీ ప్రయాణికులున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు ప్రైవేటు ట్రావలర్‌‌స కూడా డిమాండ్‌ను బట్టి రూ.500 నుంచి రూ.800ల వరకు విజయవాడ వెళ్లేందుకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా రానున్న వారం రోజులు విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement