చేనేతకు అధికారుల చేయూత
► దుస్తులు కొనుగోలు చేసిన తహసీల్దార్లు
►‘చేనేతలక్ష్మి’లో చేరిన సంక్షేమ అధికారులు
సాక్షి, సిరిసిల్ల :
వారంలో ఒకరోజు చేనేత వస్రా్తలు ధరించాలని స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర టెక్స్‌టైల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని అధికారులు, తహసీల్దార్లు స్పందించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన స్టాల్‌లో శుక్రవారం తహసీల్దార్లు చేనేత వస్త్రా లు కొనుగోలు చేశారు. సంక్షేమ అధికారులు చేనేతలక్ష్మి పథకంలో చేరారు. మంత్రి చేసిన సూచనతో ప్రతీ సోమవారం అధికారులు విధిగా చేనేత వస్రా్తలను ధరించాలని పదిరోజుల క్రితం కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ తీర్మానించడం తెలిసిందే. అదేక్రమంలో గత సోమవారం చేనేత దుస్తులు, అందునా పంచెకట్టుతో కలెక్టర్ ప్రత్యేకంగా కనిపించారు. ఆరోజు కొందరు అధికారులే చేనేత దుస్తులు ధరించడంతో..వచ్చే సోమవారం నాటికి అందరూ చేనేత దుస్తులు ధరించాల్సిందేనని కలెక్టర్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా తహసీల్దార్లు చేనేత దుస్తులు కొనుగోలు చేశారు.
‘చేనేతలక్ష్మి’లో చేరిన అధికారులు
చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేతలక్ష్మి పథకంలో అంగన్ వాడీ, సంక్షేమ శాఖల అధికారులు చేరారు. శుక్రవారం సిరిసిల్లలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జేసీ యాస్మిన్ బాషా సమక్షంలో చేనేతలక్ష్మి పథకంలో అధికారులు చేరారు. ఇప్పటివరకు 13 మంది సంక్షేమ శాఖ అధికారులు ఈ పథకంలో చేరారు. ఈ కార్యక్రమంలో డీడీడబ్ల్యూవో సరస్వతి, సీడీపీవో సబిత తదితరులు పాల్గొన్నారు.
నేత వస్రా్తలు ధరించాలి : డీఆర్‌వో
చేనేత రంగాన్ని పరిరక్షించేందుకు నేత దుస్తులు ధరించాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్యామ్‌ప్రసాద్ లాల్ సూచించారు. తహసీల్దార్లు చేనేత దుస్తులు కొనుగోలు చేసిన సందర్భంగా డీఆర్‌వో మాట్లాడారు. వారంలో ఒకరోజు చేనేత దుస్తులు ధరించి నేత కార్మికులకు ఉపాధి మెరుగు పరచాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన చేనేత లక్ష్మి పథకంలో చేరి ఐదు నెలల అనంతరం 50 శాతం లబ్ధిపొంది వస్రా్తలను కొనుగోలు చేసుకోవాలన్నారు. ప్రజలను ఈ పథకంలో చేర్పించి, నేతకార్మికులకు చేయూతనందించాలని కోరారు. ఈకార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి గంగయ్య, తహసీల్దార్లు రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.