
మాస్టర్ ప్లాన్
వరంగల్ మహానగరాన్ని అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికలను త్వరగా ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం
మార్చి 4న నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు
జూన్ 2న ఔటర్ పనులకు శంకుస్థాపన
డిప్యూటీ సీఎం కడియం, మంత్రి కేటీఆర్ నిర్ణయం
గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై సమీక్ష
వరంగల్ : వరంగల్ మహానగరాన్ని అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికలను త్వరగా ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నగర అభివృద్ధికి కీలకమైన మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు గడువు నిర్ణయించారు. మార్చి 4న వరంగల్ మహానగరం మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులను వచ్చే జూన్ 2న మొదలుపెట్టాలని నిర్ణయించారు. వరంగల్ మహానగరం అభివృద్ధి కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మున్సిపల్ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని సచివాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
‘వరంగల్ మహానగరం అభివృద్ధికి అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను వెంటనే రూపొందించాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న మాస్టర్ ప్లాన్ 1971లో రూపొంచిందించి. మహానగరం అభివృద్ధికి దోహదపడేలా ఇది లేదు. కొత్త మాస్టర్‌ప్లాన్‌పై కసరత్తు చేయాలి. మార్చి 4న మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలి. కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించే వరకు భవన నిర్మాణ అనుమతులలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవద్దు. భూగర్భ డ్రెయినేజీ, రేడియల్ రోడ్లు, స్లి్పట్ రోడ్లు, పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్, వినోద కేంద్రాలు ఉండేలా మాస్టర్ ప్లాన్ ఉండాలి. ఏడాదిలోపు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. వరంగల్ నగర అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నా... పనుల్లో జాప్యం జరుగుతోంది. అధికా>రులు ఇప్పటికైనా శ్రద్ధ పెట్టాలి. వరంగల్ ఔటర్ రింగ్‌రోడ్డు పనులపై ఏడాదిగా చెబుతున్నా పనులు జరగడం లేదు. ఈ పనులపై వెంటనే షెడ్యూల్ సిద్ధం చేయాలి. జూన్ 2న ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభించాలని నిర్ణయించాము. అప్పటిలోపు అవసరమైన భూసేకరణ, డీపీఆర్ పనులు పూర్తి చేయాలి. 2018 నాటికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళిక ఉండాలి. 72 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతి 20 కిలో మీటర్లకు ఒక విశ్రాంతి కేంద్రం, రేడియల్ రోడ్లు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వసతులను ఏర్పాటు చేసేలా ప్రణాళిక ఉండాలి.
టెండర్లు పిలిచేలోపే మొత్తం భూసేకరణ జరగాలి. భూసేకరణ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి’ అని అధికారులకు ఇద్దరు మంత్రులు ఆదేశాలు జారీచేశారు. ఔటర్ రింగ్‌రోడ్డు, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సమీక్ష కోసం ప్రతి నెలా వరంగల్‌లో సమావేశం జరగాలని నిర్ణయించారు. బుధవారం జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష కోసం మార్చి 4న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బి.వి.పాపారావు, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు డి.వినయభాస్కర్, అరూరి రమేశ్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎం.యాదవరెడ్డి, మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్, రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీ రవీందర్‌రావు, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ శృతిఓజా తదితరులు పాల్గొన్నారు.