ఉల్లి.. తల్లడిల్లి | onion farmer problems | Sakshi
Sakshi News home page

ఉల్లి.. తల్లడిల్లి

Published Sun, Dec 4 2016 11:22 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ఉల్లి.. తల్లడిల్లి - Sakshi

ఉల్లి.. తల్లడిల్లి

‘ఉల్లి’పంట.. ఈ సారి రైతన్న కంట కన్నీరు తెప్పిస్తోంది. గతేడాదిలాగే ఈసారి రెండు, మూడు నెలల వరకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర ఉన్నా..ఆ తర్వాత పతనమైంది.

- గిట్టుబాటు ధర లేక నష్టాల బాట
- రైతన్నను పట్టించుకోని ప్రభుత్వం
- రోడ్డున పడిన ఉల్లి రైతు


‘ఉల్లి’పంట.. ఈ సారి రైతన్న కంట కన్నీరు తెప్పిస్తోంది. గతేడాదిలాగే ఈసారి రెండు, మూడు నెలల వరకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర ఉన్నా..ఆ తర్వాత పతనమైంది. దీంతో రైతుల ఆశలన్నీ అడియాశలయ్యాయి. దిగుబడి వస్తుంది.. ధర దక్కుతుంది..ఈ సారి అప్పుల ఊభిలోంచి గట్టెక్కొచ్చని ఎన్నో ఆశలతో రైతులు ‘ఉల్లి’ సాగు చేస్తే.. తెగుళ్లు దిగుబడిపై ప్రభావం చూపగా,  చేతికందిన పంటకూ గిట్టుబాటు ధర లేక రైతన్న తల్లడిల్లుతున్నాడు. కనీసం పెట్టుబడి కూడా చేతికి దక్కక దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నాడు.

రోడ్డున పడిన ఉల్లి రైతులు
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 14 వేల మందికి పైగా రైతులు 6,200 హెక్టార్ల విస్తీర్ణంలో ఉల్లి సాగు చేశారు. రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి డివిజన్లలో ఎక్కువగానూ.. మిగిలిన డివిజన్లలో అక్కడక్కడ ఈ పంట సాగు చేశారు. ఎకరా ఉల్లి పంటకు రూ.50 నుంచి రూ.60 వేలు పెట్టుబడి పెట్టారు. పంట బాగుంటే ఎకరాకు 10 టన్నులు (100 క్వింటాళ్లు) పండాలి. టన్ను కనీసం రూ.8 వేలు పలికితే ఎకరాకు రూ.15 నుంచి రూ.20 లాభం వస్తుంది. కానీ ఈ ఏడాది పరిస్థితి దారుణంగా ఉంది.

వర్షాభావం..తెగుళ్ల ప్రభావం :
వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలు అడుగంటిపోవడం వల్ల పంట కాలంలో రైతులు నానా అవస్థలు పడ్డారు. ఉన్న నీటి వనరులు సద్వినియోగం చేసుకున్నారు. కానీ. మజ్జిగ తెగులు, వెర్రి తెగులు ఆశించడంతో చాలా ప్రాంతాల్లో పురుగు మందుల పిచికారీకి ఎక్కువ ఖర్చు చేశారు. అలాగే కూలీల ఖర్చు అధికంగానే పెట్టినట్లు తెలిపారు.

ఎకరాకు ఆరు టన్నులు (60 క్వింటాళ్లు) కూడా దిగుబడి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరేలే మంచి ధరలైనా పలికితే గట్టెక్కవచ్చని ఆశించిన రైతులకు పుండు మీద కారం చల్లినట్లు ధరలు పతనం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. టన్ను రూ.4 నుంచి రూ.5 వేల మధ్య పలుకుతుండటం, దాన్ని కూడా కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా చేతికి రావడం లేదని ఆందోళన చెందుతున్నారు.

పట్టించుకోని సర్కారు
నాలుగైదేళ్లుగా ధర ఆశించిన స్థాయిలో ఉంటూ వచ్చింది. గతేడాది కూడా ధర బాగుంది. అయితే రెండు, మూడు నెలల నుంచి తగ్గుతూ వచ్చింది. పంటను రైతన్న విడిగా విక్రయించినా ప్యాకెట్‌ (40 కిలోలు) ధర ప్రస్తుతం రూ.200 నుంచి 250 వరకు పలుకుతోంది. రెండు నెలల క్రితం అదే ప్యాకెట్‌ ధర రూ.500 నుంచి రూ.600 వరకు పలికింది. గతేడాది అయితే ప్యాకెట్‌ ధర రూ.1000 వరకు పలికింది. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర అయితే రూ.10 వరకు పలుకుతుండడంతో గిట్టుబాటు కాలేదు.

ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన సర్కార్‌ ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లా మంత్రులు, అధికార పార్టీ నేతలు కానీ, మార్కెటింగ్‌శాఖ, ఉద్యానశాఖ తరఫున కూడా ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో ఉల్లి రైతు లబోదిబోమంటున్నాడు. ధరలు లేనప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేస్తే కొంత వెసులుబాటు లభిస్తుందని రైతులు భావిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సారి ఉల్లి దిగుబడి ఆశించిన స్థాయిలో రావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ఉద్యానశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు.
 
సాగు విస్తీర్ణం పెరిగింది
ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడి కూడా పెరిగింది. జిల్లాలో మామూలుగా 3 వేల హెక్టార్లలోపు ఉల్లి సాగయ్యేది. నాలుగైదేళ్లుగా ధరలు బాగానే ఉంటుండడంతో  ఈ ఏడాది సాగు విస్తీర్ణం రెట్టింపయ్యింది. పొరుగు ఉన్న కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లోనూ అదే పరిస్థితి. ఇవి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకలో  సాగు విస్తీర్ణం మరింతగా పెరిగింది. దిగుబడి కూడా బాగా రావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.  జనవరి 15 తర్వాత కానీ ఫిబ్రవరి నెలలో ధరలు పెరిగే అవకాశం ఉంది.
– బీఎస్‌ సుబ్బరాయుడు, ఉద్యానశాఖ డీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement