గర్జిస్తున్న హోదా గళాలు | People in fire about Ap special status | Sakshi
Sakshi News home page

గర్జిస్తున్న హోదా గళాలు

Published Sun, Nov 6 2016 1:52 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

గర్జిస్తున్న హోదా గళాలు - Sakshi

గర్జిస్తున్న హోదా గళాలు

ప్రత్యేక హోదా మన హక్కు.. రాష్ట్రవ్యాప్తంగా ఎలుగెత్తి నినదిస్తున్న ప్రజానీకం...
 
- కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని సీఎం అర్ధరాత్రి స్వాగతించడం దారుణం
- పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందే
- దగాపై రగులుతున్న యువత
 
 సాక్షి, అమరావతి:  అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రామనాథాన్నిఒక పుస్తకాల షాపు ముందున్న బోర్డు ఆకర్షించింది. ‘మా షాపులో దొరకని పుస్తకం అంటూ ఉండదు’ అన్న బోర్డును చూసి.. అంత సీన్ ఉందా! లేని పుస్తకం అడిగి ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా షాపు దగ్గరికెళ్లి ‘ఏమోయ్... ప్రపంచంలోనే అత్యధికంగా అబద్ధాలు చెప్పిన పుస్తకం మీ దగ్గర ఉందా?’ అని అడిగాడు. షాపు యజమాని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రామనాథం చేతిలో ఓ పుస్తకం పెట్టాడు. ఆ పుస్తకం చూసి రామనాథానికి మూర్ఛ వచ్చినంత పనయ్యింది. ఇంతకీ ఆ పుస్తకం ఏమిటంటారా... ‘తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టో’

 ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశమిది.
 ‘‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’’... ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా గొంతెత్తి వినిపిస్తున్న నినాదం. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ, కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికే విలువ లేకుండాపోతే ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఏముందని నేటి యువత ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం రేపిన విభజన  గాయం కంటే ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీలు కలిసి చేస్తున్న ద్రోహం తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందని యువతరం వాపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తమను వెన్నుపోటు పొడిచాయని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విభజన సమయంలో పార్లమెంట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా అంటే.. కాదు కాదు పదేళ్లు కావాలన్న అప్పటి ప్రతిపక్ష నాయకుడు వెంకయ్యనాయుడు ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాక నాలుక మడతేయడం చూసి రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని వల్లెవేస్తుండడంపై జనం మండిపడుతున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో రెండు ఆకులు ఎక్కువే చదివారు. వెంకయ్య నాయుడు పదేళ్లు ప్రత్యేక హోదా అంటే.. అది సరిపోదు 15 ఏళ్లు కావాల్సిందేనంటూ ఏకంగా టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల్లో పోటీకి దిగారు. 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎన్నికల ప్రచార సభలో తిరుపతి వెంకన్న సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోదీకి విన్నవించారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా సంజీవిని కాదంటూ మాట మార్చేశారు. హోదాతో వచ్చేదేమీ ఉండదని తేల్చిచెప్పేశారు. కేంద్రం ఏది ఇస్తే అదే తీసుకోవాలంటూ ప్రత్యేక ప్యాకేజీని అర్ధరాత్రి స్వాగతించారు. రాష్ట్రంపై ఢిల్లీ పెత్తనం ఏమిటంటూ తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో పార్టీని స్థాపించిన దివంగత ఎన్టీఆర్ స్ఫూర్తికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మోకరిల్లుతున్న తీరును చూసి టీడీపీ నాయకులు, కార్యకర్తలే ముక్కున వేలేసుకుంటున్నారు.  

 కొత్త పరిశ్రమల జాడేది?
 రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయ్యింది. ఈ రెండున్నరేళ్లలో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదు. కొత్త పరిశ్రమలు రాకపోగా సర్కారు నిర్వాకంతో ఉన్న పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే విశాఖపట్నం నుంచి హెచ్‌ఎస్‌బీసీ వెళ్లిపోయింది. మన్నవరంలో బీహెచ్‌ఈఎల్ యూనిట్ మూటాముల్లె సర్దుకోవడానికి సిద్ధంగా ఉంది. అలాగే యూనిట్లు పెట్టడానికి ముందుకొచ్చి భూములు తీసుకున్న కొన్ని సంస్థలయితే ఇక్కడి అవినీతిని తట్టుకోలేక భూములు వెనక్కి ఇచ్చేస్తున్నాయి. ఇక సీఐఐ భాగస్వామ్య సదస్సు పేరిట ప్రభుత్వం చేసిన హడావుడి అంతాఇంతా కాదు. రూ.4.67 లక్షల కోట్ల విలువైన 331 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటివల్ల పది లక్షల ఉద్యోగాలు వస్తాయని ఊదరగొట్టింది.

సదస్సు జరిగి 10 నెలలు ముగిసినా ఒక్క ప్రాజెక్టు కూడా పునాదిరాయి స్థాయిని దాటలేదు. వచ్చే ఏడాది రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రభుత్వ పెద్దలు ఇప్పటి నుంచి ప్రచారం ప్రారంభించారు. పెట్టుబడుల కోసమంటూ ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి 16కు పైగా విదేశీ పర్యటనలు చేశారు. కనీసం ఈ విమాన ప్రయాణ ఖర్చులకు సమానమైన ఒక ప్రాజెక్టు కూడా ఇంతవరకూ రాలేదని ప్రభు త్వ ఉన్నతాధికారులే ఆక్షేపిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడుల కోసం ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దేశ విదేశాల నుంచే పారిశ్రామికవేత్తలే భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి తరలివస్తారని పేర్కొంటున్నారు.  

 బాబు వచ్చాడు జాబులు పోయాయి
 అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు ఇవ్వని హామీ అంటూ లేదు. ‘‘రాష్ట్రానికి 15 ఏళ్లు ప్రత్యేక హోదా, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి, రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ’’ అంటూ నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పారు. తీరా అధికారం చేపట్టాక వాటి ఊసే ఎత్తడం లేదని ప్రజలు రగిలిపోతున్నారు. రెండున్నరేళ్లలో ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతున్నారు. గడిచిన రెండున్నరేళ్లలో సుమారు 80,000 ఉద్యోగాలు పోయినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 2013 డిసెంబర్ 31 నాటికి 5.67 లక్షలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 2016 జనవరి నాటికి 4.88 లక్షలకు తగ్గిపోయింది. విభజన సమయంలో కమలనాథన్ కమిటీ లెక్కగట్టిన 1.42 లక్షల ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయకపోగా అప్పటికే ఉన్న 80,000 కొలువులను తగ్గించేసింది. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి హామీలు నీటి మీద రాతలుగానే మారాయి. రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా కనీసం ఒక్కరికైనా ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చిన పాపానపోలేదు.

 జనం పోరుబాట
 ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు ఆరాటపడుతున్నారు. తమ హక్కును సాధించుకోవడం కోసం ఎందాకైనా పోరాడుతామంటున్నారు. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అనే నినాదం రాష్ట్రం నలుమూలలా ప్రతిధ్వనిస్తోంది. విశాఖపట్నం వేదికగా ఆదివారం జరగనున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ సభలో ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటిచెప్పి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు జనం సన్నద్ధమవుతున్నారు. గతంలో విజయవంతమైన ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ ఉద్యమ స్పూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి నడుం బిగించారు.  
 
 ప్యాకేజీ పేరిట నాటకం
 ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాక్షేత్రంలో పోరాటం ఉధృతం చేయడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త డ్రామాకు తెర తీశాయి. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర సంస్థలనే చూపిస్తూ ప్రత్యేక హోదా కంటే అధిక లాభాలు ఇచ్చే ప్యాకేజీ ప్రకటించామంటూ అర్ధరాత్రి ఒక ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కేంద్రం కొత్తగా ఇచ్చిన ప్రాజెక్టు గానీ, అధికంగా ఒక్క రూపాయి నిధులు గానీ లేవు. అయినా సీఎం బాబు వెంటనే ఇదో అద్భుతమైన ప్యాకేజీ అంటూ స్వాగతించారు.
 
 హోదాతో లాభాలెన్నెన్నో...
 ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు అనేక రాయితీలు లభిస్తాయి. ఆదాయపు పన్ను, అమ్మకం పన్ను, ఎక్సైజ్ సుంకాల్లో రాయితీలకుతోడు తక్కువ వడ్డీకే రుణాలు, రవాణా వ్యయాన్ని ప్రభుత్వమే భరించడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పారిశ్రామికవేత్తలకు అనేక రకాల ప్రోత్సాహకాలు అందుతాయి. పరిశ్రమలు ఏర్పాటైతే యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకు పరుగెత్తాల్సిన అగత్యం ఉండదు. ఎన్నో లాభాలున్న ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా ప్యాకేజీతో సరిపెట్టుకోవాలంటున్న చంద్రబాబుపై నిరుద్యోగులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement