అడుగడుగునా నిఘా | police picketing | Sakshi
Sakshi News home page

అడుగడుగునా నిఘా

Published Tue, Jul 25 2017 10:25 PM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM

అడుగడుగునా నిఘా - Sakshi

అడుగడుగునా నిఘా

కాపు నేతలపై ఆంక్షలు
విస్తృతంగా తనిఖీలు
పలుచోట్ల హౌస్‌ అరెస్టులు
కొనసాగుతున్న చెక్‌పోస్టులు
అమలులో సెక‌్షన్‌ 30, 144
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకోవడానికి సిద్దమౌతున్న కాపులపై పోలీసులు నిఘా పెట్టారు. ముఖ్యమైన నేతలను హౌస్‌ అరెస్టులు చేస్తుండగా, మిగిలిన నాయకులపై ఆంక్షలు విధించారు. ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్టులు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. స్వయంగా ఎస్పీ రవిప్రకాష్‌ కూడా కాపుల జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్లకు వెళ్లి అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉద్యమాల్లోకి వస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. విద్యార్ధులు ఈ పాదయాత్రలో పాల్గొని తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. పోలీసులు ఎప్పుడు మా  గ్రామం విడిచి వెళ్తే అప్పుడు పాదయాత్ర ప్రారంభిస్తానని ముద్రగడ ప్రకటించడంతో ఎంతకాలం ఈ ఆంక్షలు ఉంటాయన్న దానిపై స్పష్టత లేదని పోలీసులు చెబుతున్నారు. కొవ్వూరులో ఐదుగురు  కాపు నాయకులను మంగళవారం ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. గామన్‌ ఇండియా బ్రిడ్జి జంక్షన్, రోడ్డు కం రైలు వంతెన, విజ్జేశ్వరం ఆనకట్ట జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు కొనసాగుతున్నాయి. పట్టణంలో ప్రధాన కూడళ్లతో పాటు చాగల్లు, తాళ్లపూడిలో పోలీసు చెక్‌ పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా వైపు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు యాభై మందికి పైగా కాపు నాయకులకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. సెక్షన్‌30 పోలీసు యాక్టుతో పాటు 144 సెక్షన్‌ విధించారు. కాపు సంఘం నాయకులను పోలీసు స్టేషన్‌లకు పిలిపించుకుని కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. రెండు రోజుల పాటు బయటకి వెళ్లవద్దని పోలీసులు నాయకులకు ఆంక్షలు విధిస్తున్నారు. సెక్షన్‌30, 144 లు అమలులో  ఉన్నందున పోలీసుల అనుమతి లేకుండా ఏవిధమైన సభలు, సమావేశాలు, దీక్షలు నిర్వహించకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా బెదిరింపులకు దిగడాన్ని కాపునేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. బస్సులలో కూడా తనిఖీలు చేస్తున్నారు. సీతంపేట బ్యారేజ్‌ సెంటర్, కొవ్వూరు గామన్‌ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులలో మూడు షిఫ్ట్‌లుగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కార్లలో ప్రయాణించే వారి వివరాలు, వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు, కారు నంబర్‌తో సహా రిజిష్టర్‌లో నమోదు చేసి పంపుతున్నారు. అంతేకాకుండా అనుమానం వచ్చిన వ్యక్తుల నుంచి ఆధార్, ఇతర గుర్తింపుకార్డులను పరిశీలించి మరీ వెళ్లడానికి అనుమతి ఇస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఏలూరు నగరంలోని పలు ముఖ్య కూడళ్ళతో పాటు నగర సరిహద్దులలో మొత్తంగా 15 పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. ఈ పికెట్‌లలో ఏఎస్సై స్థాయి అధికారితో పాటు ఒక హెడ్‌ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు, మరో నలుగురు హోంగార్డులను నియమించి నగరం గుండా రాకపోకలు సాగించే అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. తాళ్లపూడిలో మండలంలో ఎనిమిది మంది కాపునేతలకు నోటీసులు ఇచ్చారు. జాతీయరహదారిపై కైకరం, చేబ్రోలు, నారాయణపురం, ఉంగుటూరు, నాచుగుంట, బాదంపూడి వద్ద పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పెరవలి మండలంలో కాపులు అధిక సంఖ్యలో ఉండటంతో పాటు పద్మనాభం పాదయాత్ర కానూరులో ఉండటంతో పోలీసులు ముందస్తుగా మూడుచోట్ల పోలీస్‌ పికెట్లు ఏర్పాట్లు చేసారు. మండలంలో కాపు నాయకులకు పోలీసులు ముందస్తుగా నోటీసులు ఇచ్చారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి నిర్వహించతలపెట్టిన అమరావతి పాదయాత్రను పురస్కరించుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా తాడేపల్లిగూడెం పట్టణానికి అదనపు బలగాలను రంగంలోకి దింపారు. కడప, కృష్ణా జిల్లాల నుంచి 50 మందితో పాటు తాడేపల్లిగూడెం పట్టణం, రూరల్, పెంటపాడు పోలీస్‌ స్టేషన్‌ల నుంచి మరో 50మంది మొత్తం వంద మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాపునాయకులు పలుప్రాంతాల్లో సమావేశాలు సమావేశాలు నిర్వహించి  ఎన్ని అవాంతరాలు వచ్చినా పాదయాత్ర చేయడానికి సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. కాపు  ఉద్యమ నాయకుడు ముద్రగడ చేపట్టబోమే పాదయాత్రకు కాంగ్రెస్‌ పార్టీ  పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మహ్మాద్‌ రఫీఉల్లా బేగ్‌  తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement