తాగునీటి పథకాలకు పవర్ కట్
పేరుకుపోయిన కరెంటు బిల్లు బకాయిలు చెల్లించకపోవడంతో శనివారం ఆదోని డివిజన్‌లోని తాగునీటి పథకాలకు ట్రాన్స్‌కో అధికారులు పవర్ కట్ చేశారు.
– ఆదోని డివిజన్‌లో విద్యుత్ సరఫరా నిలిపేసిన ట్రాన్స్‌కో అధికారులు
– సీఈఓతో చర్చించి సరఫరాను పునరుద్ధరించిన వైనం
కర్నూలు సిటీ: పేరుకుపోయిన కరెంటు బిల్లు బకాయిలు చెల్లించకపోవడంతో శనివారం ఆదోని డివిజన్‌లోని తాగునీటి పథకాలకు ట్రాన్స్‌కో అధికారులు పవర్ కట్ చేశారు. జిల్లావ్యాప్తంగా 889 పంచాయతీలుండగా 1498 గ్రామాలకు 56 సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు(సీపీడబ్ల్యూఎస్), 3257ప్రజా తాగునీటి పథకాల ద్వారా నీటిని అందిస్తున్నారు. వీటికి సంబంధించి కరెంట్ చార్జీలు భారీగా పెండింగ్‌లో ఉండడం వల్ల ఆదోని డివిజన్ అధికారులు విద్యుత్ కట్ చేశారు. దీంతో ఏపీ పంచాయతీరాజ్ చాంబర్స్, ఏపీ గ్రామ పంచాయతీల సర్పంచ్‌ల సంఘం నాయకులు విషయాన్ని జెడ్పీ సీఈఓ బీఆర్.ఈశ్వర్, డీపీఓ ఆనంద్ దష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన ఆయన ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడి విడతలవారీగా బిల్లు బకాయిల చెల్లింపునకు హామీ ఇవ్వడంతో మధ్యాహ్న సమయంలో సరఫరాను పునరుద్ధరించారు. దీనిపై ట్రాన్స్‌కో సీనియర్ అకౌంట్ ఆఫీసర్ మాత్రునాయక్ జెడ్పీ సీఈఓ వద్దకు వచ్చి చర్చలు జరిపారు. ఆదోని డివిజన్‌కు చెందిన తాగునీటి పథకాలకే రూ. 6 కోట్ల వరకు బిల్లు బకాయిలున్నట్లు చెప్పగా ఒకేసారి చెల్లించేందుకు బడ్జెట్ లేదని సీఈఓ తెలిపారు. రెండు రోజుల్లో రూ. 2కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.