♦ విపక్షాలు సభను అడ్డుకుంటే వేటు వేసేందుకు ముందే కసరత్తు
♦ జల విధానం, ప్రభుత్వ కృషిని సభలో వివరించడం కోసమే..!
సాక్షి, హైదరాబాద్: ‘విపక్షాలు సహకరించాయా సరి.. లేదంటే సస్పెండ్ చేసైనా సభ జరుపుదాం. సభలో చర్చ జరగడం ముఖ్యం. రాష్ట్ర ప్రజలు, రైతాంగానికి ఏమేం చేశామో అసెంబ్లీ వేదికగా చెప్పుకొందాం’... గత నెల 22న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో జరిగిన సంభాషణల సారాంశం. అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం సరిగ్గా ఇదే నిజమైంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐలకు చెందిన 29 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. రైతుల రుణాల అంశంపై తీవ్ర స్థాయిలో నిరసనలు తెలపడం, స్పీకర్ విజ్ఞప్తి చేసినా వినకుండా సభను స్తంభింపజేయడం వల్లే వారందరిపై వేటు పడింది.
ఈ సస్పెన్షన్ నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నట్లు కనిపించినా... అంతకు ముందే దీనిపై సీనియర్ మంత్రులు పెద్ద కసరత్తు చేశారు. వాస్తవానికి ఈనెల ఒకటో తేదీ నుంచి అధికార, విపక్షాల మధ్య ఈ అంశం దోబూచులాడుతోంది. ఒకటో తేదీన సభ మొదలైన పది నిమిషాల్లోపే వాయిదా వేశారు. తర్వాత వరసగా మూడు రోజులు సెలవు ఇచ్చారు. ప్రతిపక్షాలు సోమవారం కూడా నిరసనలు తెలుపుతాయనే అంచనాకు వచ్చిన అధికార పక్షం దీనిపై ఓ వ్యూహాన్ని రచించింది.
సభ ప్రారంభానికి ముందే మంత్రి హరీశ్‌రావు చాంబర్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల, పోచారం, కేటీఆర్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ సమావేశమయ్యారు. భేటీ అనంతరం మంత్రులెవరూ పెదవి విప్పకున్నా... ఒక మంత్రి మాత్రం సభకు అడ్డుపడితే సస్పెండ్ చేస్తామన్న సూచనలిచ్చారు. అయితే రాష్ట్ర జల విధానం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉభయ సభలకూ వివరించాలని సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. దీనికోసం ఆయన గవర్నర్‌కు కూడా కలిశారు.
కానీ విపక్షాలు అడ్డుతగిలే అవకాశం ఉండడం వల్లే ఈ సెషన్ వరకు వారిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. గత పదిహేను నెలల కాలంలో ఆయా రంగాల్లో ప్రభుత్వ కృషిని రాష్ట్ర ప్రజలకు వివరించే లక్ష్యంతో, సభలో అడ్డంకులు లేకుండా సస్పెన్షన్ వ్యూహాన్ని అమలు చేశారని చెబుతున్నారు. అయితే సభలో విపక్షాల ఎమ్మెల్యేలు లేకుండా కేవలం అధికార పక్షం, ఎంఐఎం సభ్యులతో సమావేశాలు ఎందుకంటూ కొందరు అధికారపక్ష ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
చెప్పిందే చేశారు!
Published Tue, Oct 6 2015 1:59 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement