అదనపు కట్నం పిశాచికి నిండు గర్భిణి బలి
– ఉరేసి చంపిన భర్త, అత్త, ఆడపడచు
పుసులూరు (నంద్యాల): మరో రెండు నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన ఓ మహిళ అదనపు కట్నం పిశాచికి బలైంది. ఈ ఘటన నంద్యాల మండలం పుసులూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఖాజా హుసేన్‌కు ఐదేళ్ల క్రితం సంజామలకు చెందిన హసీనాబీతో వివాహమైంది. వీరికి ఏడాది వయస్సు ఉన్న కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం హసీనాబీ 8 నెలల గర్భిణి. కొన్నాళ్లుగా భర్త అదనపు కట్నం తేవాలని భార్యను వేధిస్తున్నాడు. అలాగే అత్త రసూల్‌బీ, ఆడపడచు సోఫియా కూడా తోడయ్యారు. ఈ విషయంపై శుక్రవారం రాత్రి వీరంతా ఆమెతో ఘర్షణ పడ్డారు. శనివారం తెల్లవారుజామున నిద్రపోతున్న హసీనాబీ మెడకు చున్నీ బిగించి హత్య చేశారు. తర్వాత ఆమె పుట్టింటికి సమాచారాన్ని అందించారు. డీఎస్పీ హరినాథరెడ్డి, రూరల్ ఎస్‌ఐ శివాంజల్ సంఘటన స్థలాన్ని సందర్శించి, విచారణ చేశారు. తహసీల్దార్ శివరామిరెడ్డి శవ పంచనామా నిర్వహించారు. మృతురాలు భర్త, అత్త, ఆడపడచు పరారీలో ఉన్నారు.