అమ్మవారికి ఆలస్యంగా నివేదన
విజయవాడ (ఇంద్రకీలాద్రి ) :
దుర్గగుడి అధికారులు వీఐపీల సేవలో తరించడంతో మంగళవారం అమ్మవారికి సమర్పించే నివేదన ఆలస్యమైంది. మధ్యాహ్నం అమ్మవారికి నివేదన సమర్పించేందుకు ఆలయ అర్చకులు సిద్ధమయ్యారు. మేళతాళాలతో ఆలయ అర్చకులు నివేదనను తీసుకుని అమ్మవారి ముఖ మండపం వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే ఆలయం లోపల కొందరు వీఐపీలు ఉండటంతో వారు బయటకు వచ్చే వరకు నివేదనను పట్టుకుని అర్చకులు వేచి ఉండాల్సి వచ్చింది. అర్చకులు ఎంత పిలిచినా అంతరాలయంలో ఉన్నవారు బయటకు రాలేదు. వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య ఆగ్రహంతో గట్టిగా కేకలు వేయడంతో వీఐపీలు బయటకు వచ్చారు.
ఉద్యోగులపై చర్యలు: ఈవో
అమ్మవారికి నివేదన సమర్పించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు ఈవో సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశామని, ఇన్‌స్పెక్టర్, ఏఈవోకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అమె పేర్కొన్నారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని స్థానాచార్యను కోరినట్లు తెలిపారు.