సాగునీటి కోసం పోరుబాట
= ఆయకట్టుకు హంద్రీ–నీవా నీరందే వరకూ ఉద్యమిస్తాం
= ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
జీడిపల్లి(బెళుగుప్ప) : హంద్రీ–నీవా ఆయకట్టుకు సాగునీటిని అందించే వరకూ రైతుల పక్షాన పోరాడతామని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. గురువారం బెళుగుప్ప మండలం జీడిపల్లి వద్ద వందల మంది రైతు కుటుంబాలు, హంద్రీనీవా ఆయకట్టు సాధనసమితి, పార్టీ నాయకులతో కలిసి ఆయన సామూహిక పుష్కర స్నానాలు చేశారు. సాగునీరు అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కృష్ణమ్మకు సామూహిక తర్పణాలు వదిలారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జీడిపల్లి రిజర్వాయర్ వరకు 80 శాతం హంద్రీ–నీవా సాగునీటి పనులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పూర్తి చేశారని, 20 శాతం పనులు పూర్తి చేయకుండా ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
సాగునీటిని మొదటిదశ ఆయకట్టుకు అందిస్తే వైఎస్సార్‌ను అందరూ గుర్తుంచుకుంటారన్న అసూయతోనే ఆ నీటిని కుప్పం నియోజకవర్గానికి తీసుకెళ్లేందుకు రెండోదశ పనులు శర వేగంగా చేపట్టారన్నారు. వరుసగా ఐదేళ్లుగా జీడిపల్లికి నీరు వస్తున్నా, సాగునీరు మాత్రం ఎకరం పొలానికి కూడా అందించలేదన్నారు. ఆయకట్టు రైతులకు మద్దతుగా ఇప్పటికే నిరసన దీక్షలు, ధర్నాలు, జల జాగరణలు చేపట్టి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచామన్నారు. హంద్రీనీవా పథకంలో ఈ ప్రాంతానికి సంబంధించిన 36వ ప్యాకేజీలో రూ.93 కోట్ల పనులకు సంబంధించి రూ.56 కోట్ల పనులను పెండింగ్ పెట్టారన్నారు.
ఎలాంటి జీఓలను అనుసరించకుండానే రూ.336 కోట్లకు ప్రభుత్వ ప్రతిపాదనలు పెంచుకొని ప్రజాధనాన్ని దోచుకోవడానికి టీడీపీ నాయకులు పన్నాగం పన్నారన్నారు. ఇప్పటికే జీడిపల్లి రిజర్వాయర్ కింద ఉన్న జీడిపల్లి గ్రామానికి రెండుసార్లు వచ్చిన సీఎం.. జీడిపల్లి పునరావాసం కింద ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీటిని అందించి, జీడిపల్లికి పునరావాసం కల్పించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణయ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి దుద్దేకుంట రామాంజనేయులు, మండల అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, బెళుగుప్ప సింగిల్‌విండో అధ్యక్షుడు శివలింగప్ప, సర్పంచ్ రామేశ్వరరెడ్డి, మండలాధ్యక్షులు యశోదమ్మ, హంద్రీనీవా ఆయకట్టు సాధనసమితి నాయకులు రాకెట్ల అశోక్, తేజోనాథ్, పార్టీ నాయకులు, ఆయకట్టు సాధనసమితి సభ్యులు పాల్గొన్నారు.