ప్రొటోకాల్ రగడ
– కర్నూలు ఎంపీ, రాజ్యసభ ఎంపీకి అందని ఆహ్వానం
– ఎమ్మెల్యేతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
కర్నూలు(టౌన్): అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ప్రొటోకాల్ రగడ రాజుకుంది. శనివారం సాయంత్రం స్థానిక మధర్‌థెరిస్సా సర్కిల్ వద్ద రూ. 2.30 కోట్ల కృష్ణాపుష్కారాల నిధులతో రోడ్డు విస్తరణ పనులు, పుట్‌పాత్, గ్రీనరీ పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నగరపాలక కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్, డీఈలు తప్పని సరిగా హాజరు కావాల్సి ఉంది. అయితే వీరికి సరైన సమయంలో సమాచారం ఇవ్వలేదు. కాంట్రాక్టర్ ఏకపక్షంగా ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇవ్వడం విమర్శలు తావిచ్చింది. ప్రొటోకాల్ ప్రకారం పార్లమెంట్ సభ్యులను పిలవాలి. అయితే ఆమె ప్రతిపక్ష పార్టీలో ఉండడంతో సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే అదే పార్టీలో కొనసాగుతున్న రాజ్యసభ సభ్యునికి ప్రాధాన్యం కల్పించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్, ఇతర అధికారులు కనిపించకపోవడం గమనార్హం. ఇదే విషయంపై సాక్షి మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీంద్ర బాబును ఫోన్‌లో సంప్రదిస్తే.. సమాచారలోపం వల్ల సమయానికి చేరుకోలేకపోయామని సమాధానమిచ్చారు.