
అసెంబ్లీలో తీర్మానం పెట్టండి
♦ ‘కాపు రిజర్వేషన్ల’పై ఉమ్మారెడ్డి డిమాండ్
♦ వైఎస్సార్‌సీపీ సంపూర్ణంగా మద్దతిస్తుందని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కాపు సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టాలని, అందుకు తాము సంపూర్ణంగా మద్దతునిస్తామని మండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కేంద్రంలో టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి పార్లమెంట్‌లోనూ కాపు రిజర్వేషన్లపై తీర్మానం ఆమోదింపజేయాలని కోరారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమిళనాడులో బీసీలను 9వ షెడ్యూల్‌లో చే ర్పించి రిజర్వేషన్లను 69% వరకూ ఎలా పెంచుకోగలిగారో... కర్ణాటకలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఎలా ఇచ్చారో... ఏపీలోనూ అలాగే చేయాలని సూచించారు. కాపులకు రాజ్యాంగపరమైన హక్కుగా రిజర్వేషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్‌సీపీ కాపులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతోందంటూ టీడీపీ విమర్శలు చేయడం అర్థరహితమని ఉమ్మారెడ్డి అన్నారు. కాపు గర్జన జరిగితే టీడీపీయే అస్తిత్వం కోల్పోతుందని, అందుకే చంద్రబాబు అసహనంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌లు కాపులను రెచ్చగొడుతున్నాయని, అధికారం కోసం వైసీపీ గుంటకాడ నక్కలాగా కాచుకుని కూర్చు ందని ప్రభుత్వ సమాచార సలహాదారు పత్రికా ప్రకటనను విడుదల చేయడంపై ఉమ్మారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్.కృష్ణయ్య కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఉంటే చంద్రబాబు ఆయనకు నచ్చజెప్పకపోవడం అభ్యంతకరమన్నారు. దీన్ని బట్టి బాబే ఓవైపు కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చెబుతూ మరోవైపు అవి అమలు జరగకుండా అడ్డుకుంటున్నట్లుగా ఉందని ఆరోపించారు. కాపుల భవిష్యత్తు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయాలకు అతీతంగా జరగనున్న ఈ సభకు వైఎస్సార్‌సీపీలోని కాపులతోపాటు అందరూ తరలి రావాలన్నారు.