రద్దు పేరిట దోపిడీ
మురళీనగర్‌కు చెందిన ఉదయలక్ష్మి తిరుపతి వెళ్లేందుకు తత్కాల్‌లో బెర్తు కోసం గత రెండు రోజులుగా తీవ్రంగా ప్రయత్నించింది. ఎట్టకేలకు శుక్రవారం తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో తత్కాల్ బెర్తు కన్‌ఫర్మ్ అయ్యింది. హమ్మయ్య.. అని ఊపిరి తీసుకుని వెంకన్న దర్శనం అయ్యిందన్నంత ఆనందర పొందారు. తీరా కుటుంబమంతా బయల్దేరి రైల్వే స్టేషన్‌కు వెళ్లగా త్రుటిలో రైలు మిస్సయ్యింది. పోనీ టికెట్ రద్దు చేసుకుని సాయంత్రం పూరీ-తిరుపతి రెలైక్కుదామనుకున్నా ఆ డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. తత్కాల్ టికెట్లకు రూపాయి కూడా రాదని చెప్పడంతో తీవ్ర నిరాశ చెందాల్సి వచ్చింది.
మధురవాడకు చెందిన ఓ కాంట్రాక్టర్ కుటుంబం శుక్రవారం హైదరాబాద్ వెళ్లేందుకు రెండు మాసాల క్రితమే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఫస్టు ఏసీ రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆదివారం కాంట్రాక్టర్లతో మీటింగ్ ఉందని ఓ ప్రభుత్వ శాఖ నుంచి సమాచారం వెళ్లడంతో ఆయన ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఆయన రాకపోవడంతో కుటుంబీకులు కూడా వెళ్లలేమన్నారు. దీంతో రైలు బయల్దేరే గంట ముందు టికెట్ రద్దు చేసుకునేందుకు ప్రయత్నించగా పైసా ఇవ్వలేదు. వీరిద్దరే కాదు... టికెట్లు రద్దు చేసుకునే ప్రయాణికులందరి జేబులకు భారీగా చిల్లులు పడుతున్నాయి.
టిక్కెట్ల రద్దు భారం ప్రయాణికులకు తడిసి మోపెడు
ఆఖరి క్షణంలో రద్దు చేసుకుంటే అంతే మరి
సిటీ : రైలు ప్రయాణికులపై రద్దు భారం తడిసి మోపెడవుతోంది. టికెట్లు రద్దు చేసుకుంటే భారీగా ఛార్జీలను గత రెండు రోజులుగా అమలు చేస్తుండడంతో సాధారణ ప్రయాణికులు గొల్లుమంటున్నారు. ఎవరో దళారులు చేస్తున్నారని తమ ప్రయాణాలపై భారం మోపుతున్నారని ఆవేదన చెందుతున్నారు. దళారులను అరికట్టేందుకు ఎన్నో మార్గాలుండగా రద్దు ఛార్జీలను రెట్టింపు చేయడం వల్ల 80 శాతం మంది ప్రయాణికులు భారీగా నష్టపోతున్నారన్న అంశాన్ని తెరమీదకు తెచ్చారు.
20 శాతం మంది దళారులను వదిలించుకోవడానికి సాధారణ ప్రయాణికులను బలిపశువులను చేయడం సరికాదని పే ర్కొంటున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకొచ్చిన రై ల్వే టికెట్ రద్దు ఛార్జీల రెట్టింపుపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఛార్జీలను రద్దు చేయడం ప్రయాణికులందరికీ నష్టమేనని అభిప్రాయపడుతున్నారు.
విశాఖ రైల్వే స్టేషన్‌తో పాటు మూడు శాటిలైట్ కౌంటర్లతో కలిపి రోజుకు 1800 నుంచి 1900 మంది రిజర్వేషన్ టికెట్లు పొందుతుంటారు.
రోజుకు దాదాపు 1900 మంది తీసుకునే రిజర్వేషన్ టికెట్లతో దాదాపు 5 వేల మంది ప్రయాణికులు వివిధ రైళ్లలో రిజర్వేషన్ బెర్తులు ఆక్రమిస్తున్నారు.
ఒక రోజుకు రిజర్వేషన్ టికెట్లు అమ్మ డం ద్వారా రూ. 21.67 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకూ ఆదాయం సమకూరుతోంది.
రిజర్వేషన్ టికెట్లు రద్దు చేస్తే రెట్టింపు మొత్తం తిరిగి చెల్లించరన్న నిబంధన అమల్లోకి వచ్చినప్పటి నుంచీ 20 శాతం మంది ప్రయాణికులు టికెట్ల రద్దు చేయడం మానేశారు.
రెట్టింపు మొత్తం రద్దు నిబంధన అమల్లోకి రాని రోజుల్లో స్టేషన్‌లోని 10వ నెంబర్ బుకింగ్ కౌంటర్ నుంచే ఎక్కువ రిజర్వేషన్ టికెట్లు రద్దయ్యేవి. రెండు రోజులుగా రెగ్యులర్‌గా టికెట్లు రద్దు చేసే వారు పెద్దగా కనిపించ డం లేదని రైల్వే వర్గాలు తెలిపాయి.
ప్రతి శని, ఆదివారాల్లోనే దళారులు ఎక్కువగా టికెట్లు కొని అట్టేపెట్టుకుని రైలు ఓ గంటలో బయల్దేరుతుందనగా సమయం చూసి రెట్టింపు ధరకు అమ్ముకునే వారు. అలా ఇప్పుడు ఆ టికెట్ రద్దు చేస్తే పైసా ఇవ్వడం లేదు. అందుకే దళారుల సంఖ్య కాస్త తగ్గినట్టు అంచనా వేస్తున్నారు.
మరో పక్క ప్రయాణికులు మాత్రం భారీగా నష్టపోతున్నారు. సెకండ్ క్లాస్ ఏసీ టికెట్ రద్దు చేసుకుంటే గతంలో రూ. 100 ఉండేది. ఇప్పుడా మొత్తం రూ. 200కు పెంచారు. జనరల్ బోగీ ప్రయాణ టికెట్, రిజర్వేషన్, థర్డ్ ఏసీ ఇలా అన్ని బోగీల్లో రెట్టింపు చేశారు.