
‘రోజ్’మండ్రి
సాక్షి, రాజమండ్రి : రోజ్ మిల్క్..ఇదేంటనుకుంటున్నారా..రాజమండ్రి పుష్కరాలకు వచ్చే భక్తులు స్నానాలు చేశాక ఈ పానీయం తాగి హాయిగా సేదదీరుతున్నారు. రాష్ట్రంలో రోజ్‌మిల్క్‌కు రాజమండ్రి పేరొందింది. నల్లమందు సందుకు సమీపంలోనూ, కోటగుమ్మంకు దగ్గరలోను ఉన్న రెండు దుకాణాలు ఎన్నో ఏళ్ల నుంచి రోజ్‌మిల్క్‌ను నాణ్యమైన రుచితో విక్రయిస్తున్నాయి. మంచి రుచి ఉండే ఈ మిల్క్ దుకాణాలు పలు స్నాన ఘాట్‌లకు దగ్గరగా ఉండడంతో యాత్రికులు పోటెత్తుతున్నారు.
గ్లాస్ రూ.30 కావడంతో ఒకటి లేదా రెండేసి తాగుతున్నారు. చాలాకాలం తర్వాత వ్యాపారానికి విపరీతమైన గిరాకీ ఉండడంతో నిర్వాహకులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అధికారులు, పుష్కరాల బందోబస్తు, పర్యవేక్షణకు వచ్చిన ప్రభుత్వ సిబ్బంది ఈ రోజ్‌మిల్క్‌ను సేవించడంతోపాటు తమ పై అధికారులకు ప్యాక్ చేసి తీసుకువెళ్తున్నట్టు నిర్వాహకులు వివరించారు.