కంటి చూపు ఇప్పించండి | rajappa meets eye victims | Sakshi
Sakshi News home page

కంటి చూపు ఇప్పించండి

Published Thu, Jul 6 2017 3:32 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

కంటి చూపు ఇప్పించండి - Sakshi

కంటి చూపు ఇప్పించండి

డిప్యూటీ సీఎంను వేడుకున్న బాధితులు
న్యాయం చేస్తామని రాజప్ప హామీ
పూర్తిస్థాయి విచారణకు కలెక్టర్‌కు ఆదేశం
శిబిరాల నిర్వహణలో ప్రభుత్వ వైద్యులు ఉండేలా ఆదేశాలు ఇచ్చేందుకు చర్యలు

 
వేట్లపాలెం (సామర్లకోట) : పోయిన కంటి చూపు వచ్చేలా వైద్య పరీక్షలు చేయించాలని బాధితులు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను వేడుకున్నారు. బుధవారం వేట్లపాలెంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి రాజప్ప ఆ గ్రామ సర్పంచ్‌ వల్లూరి శేషవేణి స్వగృహం వద్ద లయన్స్‌ క్లబ్‌ ఆస్పత్రి నిర్వహించిన శస్త్ర చికిత్సల్లో చూపు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. ఈ నెల 4న సాక్షి దినపత్రిక ‘చీకటి నింపిన శస్త్ర చికిత్స’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో అధికారులు, రాజకీయ నాయకులు వారి వద్దకు వచ్చి పరిస్థితి తెలుసుకొంటున్నారు. ఈ సందర్భంగా కంటి శస్త్ర చికిత్స చేయించుకున్న రామిశెట్టి సత్యవతి, కుప్పాల కృపారావు, చిట్టూరి సత్యనారాయణ, బావిశెటి రాంబాయి, గొడత రామకృష్ణ, బొండాడ సత్యానందం తమకు కంటి చూపు వచ్చేలా చేయాలని డిప్యూటీ సీఎం రాజప్పను వేడుకున్నారు.

కంటి చూపు పోవడానికి గల కారణాలను గ్రామ ఉపసర్పంచ్‌ వల్లూరి శ్రీనివాసు రాజప్పకు వివరించారు. ఈ మేరకు బాధితులకు న్యాయం చేస్తామని రాజప్ప హామీ ఇచ్చారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఏప్రిల్‌ 13న లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి శిబిరంలో వేట్లపాలేనికి చెందిన వారు 10 మంది శస్త్ర చికిత్సలు చేయించుకున్నారని వారిలో 8 మందికి కళ్లు కనిపించడం లేదన్నారు. వారి సమస్యపై కాకినాడలోని ప్రభుత్వ వైద్యాధికారులతో చర్చించామని, బాధితులకు మెరుగైన వైద్యం చేయించి కంటి చూపు వచ్చేలా చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని జిల్లా కలెక్టరును ఆదేశించామన్నారు. ఉచిత వైద్య శిబిరాలు జరిగే సమయంలో సంబందిత ప్రభుత్వ వైద్యులు హాజరు కాక పోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. శిబిరాలు జరిగే సమయంలో ప్రభుత్వ వైద్యులు తప్పనిసరిగా ఉండేలా ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొడత మార్త, జెడ్పీటీసీ సభ్యురాలు గుమెళ్ల విజయలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement