గులాబీ గూటికి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిన మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లోకి మరో చేరిక జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బుధవారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి సి.లక్ష్మారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజులతో కలసి సీఎం అధికారిక నివాసానికి వచ్చిన రామ్మోహన్‌రెడ్డికి... ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ సోదరుడైన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి, టీఆర్‌ఎస్ గూటికి చేరనున్నారని రెండు నెలలుగా ప్రచారం జరుగుతోంది. గత నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనే ఆయనతోపాటు డీకే అరుణ కూడా చేరనున్నారని వార్తలు వెలువడ్డాయి. దీనిని డీకే అరుణ ఖండించగా... రామ్మోహన్‌రెడ్డి మాత్రం గులాబీ గూటికి చేరారు.
ఇదే బాటలో మరికొందరు కాంగ్రెస్ నేతలు
ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరగా.. చిట్టెం చేరికతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. ఇక మహబూబ్‌నగర్ జిల్లాకే చెందిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఏర్పా ట్లు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు ఇదే జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, ఓ మాజీ ఎమ్మెల్యే కూడా చేరికల వరుసలో ఉన్నట్లు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒకరిద్దరు ప్రజా ప్రతినిధులు సైతం టీఆర్‌ఎస్ ప్లీనరీలోగా గులాబీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందంటున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఒకరిద్దరు నేతలు కూడా టీఆర్‌ఎస్ గూటికి చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం.
‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే’
బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామి కావాలనే ఆకాంక్షతోనే టీఆర్‌ఎస్‌లో చేరినట్లు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చెప్పారు. తన నియోజకవర్గం అభివృద్ధికి కూడా సీఎం హామీ ఇచ్చారని, తన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం తనకు ప్రధానమని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజె క్టులను పూర్తి చేయడానికి సీఎం కేసీఆర్ చూపిస్తున్న చొరవ తనను ఆకర్షించిందన్నారు. తన తండ్రి నర్సిరెడ్డి కూడా నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి కావాలని కోరుకున్నారని, భీమా ప్రాజెక్టు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తన సోదరి డీకె అరుణ రాజకీయం వేరని, తన రాజకీయం వేరని వ్యాఖ్యానించారు.