దేవరగట్టు బందోబస్తుకు సిద్ధంకండి
Published Sat, Oct 8 2016 12:59 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
– పెరేడ్ పరిశీలనలో సిబ్బందికి ఎస్పీ ఆదేశం
కర్నూలు: దేవరగట్టు బన్ని ఉత్సవంలో బందోబస్తుకు సిద్ధం కావాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పోలీసు సిబ్బందికి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పెరేడ్ మైదానంలో సివిల్, ఏఆర్ పోలీసులు శుక్రవారం నిర్వహించిన పెరేడ్‌కు ఎస్పీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బన్ని ఉత్సవాల్లో భక్తుల పట్ల మర్యాదగా మసలుకోవాలని సూచించారు. సాంకేతిక టెక్నాలజీతో సీసీ కెమెరాలను అమర్చుతున్నామని, ఉత్సవ కార్యక్రమం మొత్తం కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. డీజీపీ ప్రారంభించిన పోలీసు సేవాదళ్ సేవలను బన్ని ఉత్సవాల్లో వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు. చిన్నపిల్లలు, వికలాంగులు, వృద్ధుల పట్ల సేవాదళ్ సభ్యులు జాగ్రత్తలు తీసుకుంటూ ఏవైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలన్నారు. ఆకతాయిల పట్ల నిఘా ఉధృతం చేసి ముందస్తుగా బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అతివేగం, నిర్లక్ష్యం, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయడం చట్ట వ్యతిరేకమని డ్రైవర్లకు అవగాహన కల్పించాలన్నారు. అనాథ పిల్లలు ఎక్కడైనా కనిపిస్తే ఐసీడీఎస్‌కు అప్పగించాలని సూచించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, వెంకటాద్రి, సీఐ నాగరాజరావు, డేగల ప్రభాకర్‌రావు, మధుసూదన్‌రావు, ఆర్‌ఐలు రంగముని, జార్జి తదితరులు పాల్గొన్నారు.
Advertisement