‘ఊరూరా రిజిస్ట్రేషన్ స్టాంపులు’ సక్సెస్
♦ పోస్టాఫీసుల్లో స్టాంపుల విక్రయాలకు మంచి స్పందన
♦ రెండు నెలల్లో రూ.4 కోట్ల విలువైన స్టాంపుల విక్రయం
♦ త్వరలో గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఊరూరా రిజిస్ట్రేషన్ స్టాంపులు’ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి మంచి స్పందనే లభించింది. ప్రస్తుతం 80 మున్సిపాల్టీల్లోని పోస్టాఫీసుల ద్వారా రెండు నెలల్లో సుమారు రూ.4 కోట్ల విలువైన స్టాంపులను విక్రయించినట్లు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ల శాఖ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగా పోస్టాఫీసుల ద్వారా స్టాంపుల విక్ర యాన్ని సెప్టెంబర్ 1న ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని తొలిదశలో పట్టణ ప్రాంతాలకే పరిమితం చేసిన అధికారులు త్వరలోనే మండల కేంద్రాల్లోని పోస్టాఫీసుల్లోనూ ప్రారంభించాలని తాజాగా నిర్ణయించారు.
ఆపైన ప్రతి గ్రామంలోనూ స్టాంపుల విక్రయాలు చేపట్టాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రారంభించిన కొన్ని సేవలు ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడడం లేదు. ఆయా సేవలను సమర్థవంతంగా అందించేందుకు క్షేత్రస్థాయిలో సరైన సాంకేతిక పరికరాలు అందుబాటులో లేకపోవడమే కారణమని తెలుస్తోంది. ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, విస్తృత ప్రచారం నిర్వహించాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో వినియోగదారులకు ఉపకరించని కొన్ని సేవల వివరాలు ఇలా ఉన్నాయి.
నిరుపయోగంగా ఇంటరాక్షన్ సేవలు..
నవీకరించిన వెబ్ పోర్టల్ ద్వారా వినియోగదారులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు నేరుగా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఇంటరాక్ట్ కావచ్చని గతంలో అధికారులు ప్రకటించారు. అయితే.. వినియోగదారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన సందేహాలను నివ ృత్తి చేసే వ్యవస్థను మాత్రం ఏర్పాటు చేయలేదు. సందేహాలను నమోదు చేయడంపై వినియోగదారులకు గానీ, వాటిని పరిష్కరించాల్సిన అధికారులకు గానీ ఏ విధమైన అవగాహనా కల్పించలేదు.
పని చేయని ఎస్‌ఎంఎస్ వ్యవస్థ
ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వివిధ దశల్లో డాక్యుమెంట్ స్టేటస్‌ను సంక్షిప్త సమాచారం(ఎస్‌ఎంఎస్) రూపంలో వినియోగదారుని మొబైల్‌కు అందాల్సి ఉంది. అయితే.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సమస్యల కారణంగా ఈ పక్రియ అమలుకు నోచుకోవడం లేదు.
స్లాట్ బుకింగ్‌కు ఆదరణ కరవు
ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద నిరీక్షించాల్సిన పనిలేకుండా.. వెబ్‌పోర్టల్ ద్వారానే ముందుగా స్లాట్(పలానారోజు, సమయం)ను బుక్ చేసుకునే సదుపాయానికి కూడా వినియోగదారుల నుంచి ఆదరణ లభించడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఒకట్రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మినహా ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు అంతగా లేవు. దీంతో వినియోగదారులు ఎప్పుడు కుదిరితే అప్పడు నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్ చే యించుకుంటున్నారు.
పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్
రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఆస్తుల వివరాలను వెబ్ పోర్టల్‌లోని పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా ముందుగానే డేటాను ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ క్షణాల్లో పూర్తి అవుతుందని అధికారులు చెప్పారు. అయితే డేటా ఎంట్రీ ముందుగా చే స్తే, రిజిస్ట్రేషన్ సమయంలో తప్పులు ఉన్నాయంటూ సబ్ రిజిస్ట్రార్లు ఇబ్బంది పెడతారేమోనని వినియోగదారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.